లాయర్ సూచన మేరకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మెకు సంబంధించి సర్కారు శనివారం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పై కౌంటర్ దాఖలు చేయొద్దని జేఏసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. జేఏసీ లాయర్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డితో పలువురు నేతలు ఆదివారం భేటీ అయి చర్చించారు. సర్కారు అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలు చేయాలని తొలుత భావించినా.. లాయర్ సూచనతో నిర్ణయం మార్చుకున్నట్టు నేతలు తెలిపారు. ప్రభుత్వం తరఫు నుంచి అఫిడవిట్ వద్దని సీజే కొద్దిరోజుల కిందే స్పష్టం చేశారని, అయినా సర్కారు అఫిడవిట్ దాఖలు చేసిందని న్యాయవాది చెప్పారని వివరించారు. ప్రభుత్వ అఫిడవిట్ ను సీజే అంగీకరించకపోవచ్చని, దానిపై విచారణలో దీటుగా వాదనలు వినిపిస్తానని భరోసా ఇచ్చారని చెప్పారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం.
