మరోసారి బస్సు చార్జీలను పెంచిర్రు

 మరోసారి బస్సు చార్జీలను పెంచిర్రు
  • టోల్ చార్జీలు పెరగడంతో బస్సు చార్జీలు పెంచిన అధికారులు
  • మినిమం రూ.10, మ్యాగ్జిమం రూ.20  హైక్

హైదరాబాద్, వెలుగు: మరోసారి బస్సు చార్జీలను ఆర్టీసీ అధికారులు పెంచారు. పెరిగిన చార్జీలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఒక్కో టోల్ గేట్‌‌కు రూ.4 పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. మూడు టోల్ గేట్లు ఉన్న ఖమ్మం, విజయవాడ రూట్లలో ఎక్స్‌‌ప్రెస్ సర్వీసులకు గతంలో ఉన్న దాని కంటే రూ.10 పెరగగా, డీలక్స్ ఆపై సర్వీసులకు రూ.20 పెరిగింది. ఏప్రిల్‌‌ 1 నుంచి పెరిగిన టోల్‌‌ చార్జీలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు బస్సు చార్జీలను పెంచి, టిమ్ మిషన్లలో ఆయా మార్పులు చేశారు. అయితే, చార్జీల పెంపుపై ఆర్టీసీ ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడం గమనార్హం. ఈ చార్జీల పెంపు సామాన్యులపై భారం ఉండదని ఆర్టీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 28 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఇందులో సిటీలో 12 లక్షల మంది, పల్లె వెలుగు బస్సుల్లో 12 లక్షల మంది జర్నీ చేస్తున్నారని తెలిపారు. వీరికి చార్జీల పెంపు భారం వర్తించదని, మిగతా 4 లక్షల మందికి మాత్రమే అదనపు భారం పడనుందన్నారు. చార్జీలు పెంచినప్పటికీ ఆయా టోల్ గేట్ల వద్ద డబ్బులు చెల్లించిన తర్వాత, ఆర్టీసీకి అదనంగా రూ.5 లక్షల ఆదాయం వస్తుందన్నారు. 2 టోల్ గేట్ల మధ్య దూరం సుమారు 60 నుంచి 70 కిలో మీటర్లు ఉంటుందని, ఒక టోల్‌‌ గేట్‌‌ దాటే పల్లె వెలుగు బస్సులు 99% ఉన్నాయని తెలిపారు. 

విజయవాడ, ఖమ్మం రూట్‌‌లో రూ.20 పెంపు..

హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్లే ఎక్స్‌‌ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులకు టికెట్‌‌పై రూ.10 పెరిగింది. విజయవాడ, ఖమ్మం జిల్లాకు వెళ్లే డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల టికెట్ ధరలు ప్రస్తుతం ఉన్న దాని కంటే రూ.20 పెరిగింది. ఈ రెండు మార్గాల్లో మూడు టోల్ గేట్లు ఉన్నాయి. ఈ రెండు రూట్‌‌లు మినహా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా మూడు టోల్ గేట్లు లేవని అధికారులు చెబుతున్నారు.