- ఆ తర్వాత ప్రతి నెలా పెంచుతూ ఇచ్చేందుకు ఈడీల కమిటీ హామీ
- 2019 సమ్మెలో ఉద్యోగులపై పెట్టిన కేసుల ఎత్తివేతకూ ఓకే
- ఆర్టీసీకి అదనంగా 2 వేల కొత్త బస్సులు, 20 కొత్త డిపోలు వస్తున్నయని వెల్లడి
- యూనియన్ నేతలతో ఈడీల కమిటీ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై సంస్థ ఈడీల కమిటీ తీపి కబురు చెప్పింది. వచ్చే నెల రూ. 10 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని, ఆ తర్వాతి నెల నుంచి ఆ మొత్తాన్ని పెంచుతూ విడుదల చేస్తామని శనివారం సాయంత్రం బస్ భవన్‌లో యూనియన్ నేతలతో సమావేశమైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)ల కమిటీ స్పష్టం చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ప్రతి నెలా రూ. 100 కోట్లు చెల్లించాలనే యూనియన్ నేతల డిమాండ్‌పై ఈడీల కమిటీ స్పందిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
2019 నాటి ఆర్టీసీ సమ్మె కాలంలో ఉద్యోగులపై నమోదైన పోలీసు కేసులను ఎత్తివేయాలని కోరుతూ యాజమాన్యం తరపున ప్రభుత్వానికి లేఖ రాస్తామని కమిటీ వెల్లడించింది. టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికుడిదేననే కొత్త నిబంధన తీసుకువచ్చి కండక్టర్, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే యూనియన్ నేతల డిమాండ్‌పై ఈడీల కమిటీ స్పందిస్తూ.. దీనిపై విధి విధానాల కోసం ఓ కమిటీని నియమిస్తామని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సులతో డ్రైవర్ల ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండబోదని యూనియన్ నేతలకు ఈడీల కమిటీ భరోసా ఇచ్చింది.
కొత్తగా 2 వేల బస్సులు ఆర్టీసీకి వస్తున్నాయని, 20 కొత్త డిపోలు ఏర్పాటు చేస్తున్నామని.. డ్రైవర్లను ఇందులో సర్దుబాటు చేయడం జరుగుతుందని ఈడీల కమిటీ యూనియన్ నేతలకు స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఆర్టీసీ డ్రైవర్ల ఉద్యోగాలు పోతాయనే అపోహలను వీడాలని ఈడీల కమిటీ యూనియన్ నేతలకు సూచించింది.
