కార్మికుల్ని తీసేసే హక్కు సర్కార్‌కు లేదు: ఆర్టీసీ మాజీ చైర్మన్

కార్మికుల్ని తీసేసే హక్కు సర్కార్‌కు లేదు: ఆర్టీసీ మాజీ చైర్మన్
  • నష్టాలకు కారణం ఉద్యోగులు కాదు.. ప్రభుత్వ విధానాలే
  • మంచి పని చేస్తున్నారనే జాతీయ స్థాయిలో అవార్డులు
  • కార్మికులను బాధపెడుతున్న పాపం ఊరికే పోదు: సోమారపు

హైదరాబాద్: ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదని, ప్రభుత్వ విదానాల వల్లే సంస్థ అప్పులపాలయ్యే పరిస్థితి వచ్చిందని బీజేపీ నేత, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. వాళ్లు పడుతున్న కష్టానికి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వస్తున్నాయని, బాగా పని చేస్తున్నారని దీన్ని బట్టి అర్థం కావట్లేదా అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో కార్మికులకు తమ నిరసన తెలిపే హక్కు ఉంటుందన్నారు. ప్రభుత్వ విధానాల వల్లే కార్మికులు రోడ్డెక్కాల్సి వచ్చిందని అన్నారాయన. ఇప్పటికి సీఎం కేసీఆర్ మూడు సార్లు హెచ్చరించినా.. కేవలం మూడొందల మందే డ్యూటీలో చేరారని చెప్పారు సోమారపు. ఒక కార్మికుడిని సంస్థలో నుంచి తీసేయాలంటే అనేక నిబంధనలు ఉంటాయని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం తొలగించలేదని చెప్పారాయన. కార్మికుల్ని ప్రభుత్వం పెడుతున్న బాధ ఊరికే పోదని, ఆ పాపం కచ్చితంగా తగులుతుందని అన్నారు.

పెరిగిన జీతాలు ప్రభుత్వ ఇవ్వట్లేదు

టిక్కెట్లు, ఆర్టీసీ ఆస్తులు లీజు ద్వారానే సంస్థ ఆదాయాన్ని సమకూర్చుకుంటోందని సోమారపు చెప్పారు. అసలు ఆర్టీసీలో కార్మికుల తప్పు లేదని, ప్రభుత్వ విధానాలే సరిగా లేవని అన్నారు. ఉద్యోగులు బాగా పని చేస్తున్నారు కాబట్టే సంస్థకు జాతీయ అవార్డులు వచ్చాయని చెప్పారు. చాలా మంది కార్మికులు ఓవర్ డ్యూటీ చేస్తారని, ఓటీకి సంస్థ ఇచ్చేది చాలా తక్కువ అని తెలిపారాయన. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని కోరుతున్నారని అన్నారు సోమారపు.

ఆర్టీసీ బస్సు నడిచే రూట్లలో ప్రైవేటు మాఫియా దోపిడీ తక్కువగా ఉంటుందన్నారు. అదే ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే.. మరో ఐదేళ్లు చార్జీలు పెంచరని సీఎం హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ కార్మికుల జీతాలు 80శాతం పెరిగాయని ప్రభుత్వం పదేపదే చెబుతోంది, అయితే ఆ పెరిగిన జీతాలను సర్కార్ భరించడం లేదని, సంస్థే ఆ భారాన్ని మోస్తోందని గుర్తు చేశారాయన.

RTC workers deadline close at midnight