అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరులో పొట్టి శ్రీరాములు ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. 58అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో 6.8 ఎకరాల స్మృతి వనం కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సోమవారం ( మార్చి 16 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్ట్యాచూ ఆఫ్ శాక్రిఫైజ్ నామకరణం చేశామని అన్నారు.
అమరావతి పూర్తయితే ఈ విగ్రహం మరింత అందంగా కనిపిస్తుందని అన్నారు చంద్రబాబు. పొట్టి శ్రీరాములు త్యాగం ఈ తరం వాళ్ళు తెలుసుకోవాలని అన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్రులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని...అహింస మార్గంలో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. స్వరాష్ట్ర సాధనతో పాటు అనేక ఉద్యమాల్లో పొట్టి శ్రీరాములు పాల్గొన్నారని అన్నారు చంద్రబాబు.
తెలుగుజాతి అనేక సమస్యలు ఎదుర్కొందని.. ఇప్పటికీ ఎదుర్కొంటుందని అన్నారు.రాజధాని లేని రాష్ట్రంలో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని అన్నారు చంద్రబాబు. అమరావతిని గత పాలకులు స్మశానం అని అవహేళన చేశారని అన్నారు. అమరావతి నిర్మాణంలో ఎంతోమంది రైతుల త్యాగం ఉందని.. రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33వేల ఎకరాల భూమిని ఇచ్చారని.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ ల్యాండ్ పూలింగ్ కి సహకరించారని అన్నారు చంద్రబాబు.
