Kamran Akmal: పాకిస్థాన్‌ ఎలాగు గెలిచేలా లేదు.. ఐసీసీ ట్రోఫీని దొంగిలించాలని ప్లాన్ చేస్తుందేమో?

Kamran Akmal: పాకిస్థాన్‌ ఎలాగు గెలిచేలా లేదు.. ఐసీసీ ట్రోఫీని దొంగిలించాలని ప్లాన్ చేస్తుందేమో?

Kamran Akmal: పాకిస్థాన్ క్రికెట్ రోజురోజుకూ దిగజారి పోతుంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్​కు చేరడంలో విఫలమైన జట్టు, బంగ్లాదేశ్​తో వన్డే సిరీస్​ను కోల్పోయింది. దీంతో పాక్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో సిరీస్ ఓటమిపై పాక్​ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సొంత టీమ్ పైనే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ క్రికెట్ పూర్తిగా పతనం అయిపోతుంది.. ఇది ఇలాగే కొనసాగితే నెదర్లాండ్స్ జట్టుపైనా ఓటమి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని గుర్తు చేశారు. కనీసం ద్వైపాక్షిక సిరీస్​లు గెలవకపోతే ఐసీసీ ట్రోఫీలు ఎలా గెలుస్తారంటూ మండిపడ్డారు. 

బంగ్లాదేశ్ తో పాకిస్తాన్​ సిరీస్​ కోల్పోయిన తర్వాత కమ్రాన్ అక్మల్ ఓ కార్యక్రమంలో  మాట్లాడుతూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ క్రికెట్ క్రమంగా నాశనం అవుతుంది. వరుసగా సిరీస్​లను ఓడిపోతున్నాం.. అయినప్పటికీ PCB ఎవరిపైనా వేటు పడకపోవడం దారుణం అన్నారు. పాక్ క్రికెట్ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి.. మనం ఏ స్థాయి నుంచి ఎక్కడికి దిగజారిపోయామో అన్నారు. పాక్​తో 3 వన్డేల సిరీస్ ఆడే ఛాన్స్ దక్కితే, మనల్ని ఓడించి తాము కూడా ‘టెస్ట్ హోదా’ సాధించవచ్చని నెదర్లాండ్స్ టీమ్ కూడా ఆలోచిస్తుందేమో.. మన ఆటను కామెడీగా మార్చేశారు.. ఎవరిలో కూడా కనీస బాధ్యత లేదని అక్మల్ పేర్కొన్నారు. 
 
బంగ్లాదేశ్​తో జరిగిన వన్డే మ్యాచ్​లో ఎలాంటి ప్రయోగాలు చేశారు? అది బ్యాటింగ్​కు అనుకూలించే పిచ్.. అలాంటిది టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోకుండా, బౌలింగ్ ఎందుకు తీసుకున్నారు? అని కమ్రాన్ ప్రశ్నించారు. నిజానికి బంగ్లా 350+ పరుగులు చేయాల్సంది.. కానీ లిట్టన్ దాస్ స్లోగా ఆడడంతో 290 దగ్గరే ఆగిపోయింది. ఇది సిరీస్​ను డిసైడ్ చేసే మ్యాచ్.. ఇలాంటి ద్వైపాక్షిక సిరీస్​ల్లోనే గెలవడం లేదు.. ఐసీసీ ఈవెంట్ల కోసం ఎలాంటి ప్లాన్స్ రచిస్తున్నారని ప్రశ్నించారు. కొంపదీసి ఐసీసీ ట్రోఫీని దొంగిలించాలని ప్రణాళికలు రచిస్తున్నారా? అంటూ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.