ఆర్టీసీ చర్చలు మళ్లీ వాయిదా..

ఆర్టీసీ చర్చలు మళ్లీ వాయిదా..
  •     ఆర్టీసీ యాజమాన్యంపై  యూనియన్ నేతల మండిపాటు

హైదరాబాద్, వెలుగు:  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను అనుమతించాలని, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకి అప్పగించాలనే ప్రధాన డిమాండ్లతో కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసుపై గురువారం  జరగాల్సిన చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. చర్చలను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసినట్లు కార్మిక శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ సమ్మె నోటీసుపై చర్చించేందుకు కార్మిక శాఖ కార్యాలయానికి రావాలని ఆర్టీసీ యాజమాన్యం, యూనియన్ నేతలను సంబంధిత అధికారులు ఆహ్వానించారు. 

చర్చల్లో పాల్గొనేందుకు ఆర్టీసీ యాజమాన్యం తరపున అధికారులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో ఈ నెల 13కు చర్చలను వాయిదా వేశారు. దీనిపై యూనియన్ నేతలు మండిపడ్డారు. కావాలనే ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు గైర్హాజరైందని ఆరోపించారు. 13 న వాయిదావేస్తే మాత్రం అదే రోజు సమ్మె ప్రకటన చేస్తామని ఆర్టీసీ యూనియన్ నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి హెచ్చరించారు.