ఇక నుంచి మీ సేవ మొబైల్ యాప్లో ఆర్టీసీ టికెట్లు : టీజీ ఎస్‌ ఆర్టీసీ

ఇక నుంచి మీ సేవ మొబైల్ యాప్లో ఆర్టీసీ టికెట్లు : టీజీ ఎస్‌ ఆర్టీసీ
  • ఆవిష్కరించిన మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రయాణికులకు మరింత మెరుగైన, డిజిటల్ సేవలను అందించే దిశగా టీజీఎస్‌ఆర్టీసీ కీలక అడుగు వేసింది. ఇకపై ప్రయాణికులు తమ మొబైల్ నుంచే సులభంగా బస్సు టికెట్లు, పాస్‌లు పొందేలా ‘మీ సేవ మొబైల్ యాప్’ లో కొత్త సదుపాయాన్ని కల్పించింది. ఈ మేరకు మంగళవారం సెక్రటేరియెట్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. యాప్ సహాయంతో ఆన్‌లైన్ రిజర్వేషన్ ప్యాసింజర్ సిస్టమ్ (ఓఆర్‌‌పీఎస్) ద్వారా దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, ఇంటర్ సిటీ బస్సుల్లో టికెట్లను డిజిటల్ పద్ధతిలో బుక్ చేసుకోవచ్చు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, మెట్రో ఇలా అన్ని కేటగిరీల బస్సు టికెట్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. 

నెలవారీ బస్సు పాస్‌లను కూడా ‘మీ సేవ’ యాప్ ద్వారానే పొందవచ్చు. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో అందుబాటులో ఉన్న ‘టీ-24’ టికెట్ యాప్‌ను కూడా ఇందులో విలీనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రయాణికులు ఎక్కడి నుంచైనా, ఏ ప్రాంతానికైనా సులభంగా టికెట్లు పొందేందుకు ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఇంటర్, టెన్త్  స్టూడెంట్లు కోరుకున్న చోట బస్సు దిగొచ్చు

ఇంటర్, పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ పలు నిర్ణయాలు తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు. మంగళవారం ఆర్టీసీ అధికారులతో సెక్రటేరియట్ లో ఆయన సమీక్ష నిర్వహించారు. పరీక్షలు జరుగుతున్న సమయాల్లో ఇంటర్, పదో తరగతి విద్యార్థులు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు హాల్ట్  లేకపోయినా, బస్సు ఆగే స్టేజీ కాకున్నా.. హాల్ టికెట్  చూపించి సంబంధిత పరీక్ష కేంద్రాల వద్ద దిగవచ్చని మంత్రి చెప్పారు. 

స్టూడెంట్ల ఎక్కడ ఆపాలని కోరితే అక్కడే బస్సు ఆపేలా డ్రైవర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో అవసరమైతే అదనపు బస్సులను కూడా తిప్పుతామని తెలిపారు.