ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలు రద్దు..యూనియన్ సంఘాల నేతలతో భేటీలో స్పష్టం చేసిన యాజమాన్యం

ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలు రద్దు..యూనియన్ సంఘాల నేతలతో భేటీలో స్పష్టం చేసిన యాజమాన్యం
  • త్వరలో వెలువడనున్న ఉత్తర్వులు
  • డిపోల్లో యాజమాన్యం పెత్తనానికి ఇక చెల్లు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఇప్పటి వరకు ఉన్న వెల్ఫేర్ కమిటీలను రద్దు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. రెండ్రోజుల క్రితం యూనియన్ నాయకులతో ఆర్టీసీ ఈడీ కమిటీ సమావేశమై.. యాజమాన్యం నిర్ణయాన్ని వెల్లడించింది. దీనిపై ఎండీతో చర్చించి త్వరలోనే రద్దు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ఈడీల కమిటీ స్పష్టం చేసిందని యూనియన్ల నేతలు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు యాజమాన్యం కనుసన్నల్లో ఉన్న వెల్ఫేర్ కమిటీల పెత్తనానికి చెక్ పడనుంది.

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేసిన తర్వాత, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ప్రతి డిపోలో ఇద్దరు ఉద్యోగులతో వెల్ఫేర్ కమిటీ (ఈడబ్యూఎస్) లను నియమించింది. ఇప్పుడు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవు తుండడంతో.. యూనియన్లకు ప్రాధాన్యతనిస్తూ యాజమాన్యం ఆధిపత్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ  నిర్ణయం తీసుకోనుంది. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే వరకు ప్రతి రెండో మంగళవారం అన్ని డిపోల్లో మేనేజర్లు యూనియన్ నేతలతో సమావేశమై ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై  దృష్టి పెట్టనున్నారు.

20న జరిగే సమావేశంలో మరిన్ని నిర్ణయాలు

ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగ భద్రతకు యాజమాన్యం భరోసా ఇచ్చేందుకు వీలుగా టికెట్‌‌‌‌ను తీసుకునే పూర్తి బాధ్యత ప్రయాణికులదే అనే నిబంధనను తీసుకురావాలని యూనియన్ల చేసిన సూచనను యాజమాన్యం పరిశీలిస్తుంది. టికెట్ తీసుకోకుంటే కండక్టర్‌‌‌‌‌‌‌‌ను బాధ్యునిగా చేయకుండా ప్రయాణికుడిని బాధ్యునిగా చేసే పద్ధతి ఢిల్లీ రవాణా శాఖలో కొనసాగుతుందని, రైల్వేలోనూ ఇదే విధానం కొనసాగుతుందని ఈడీల సమావేశంలో యూనియన్ నేతలు చేసిన ప్రతిపాదనను యాజమాన్యం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

రిటైర్డ్ అయిన ఉద్యోగులకు డబ్బుల చెల్లింపుతో పాటు ఇతర ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఈడీల కమిటీ యూనియన్ నేతలకు హామీ ఇచ్చింది. సీసీఎస్‌‌‌‌కు కొత్త పాలక మండలి నియామకం కోసం ఎన్నికలు జరిపించడం, ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేయడం వంటి ఇతర నిర్ణయాలను ఈ నెల 20  జరగనున్న సమావేశంలో ఈడీల కమిటీ వెల్లడించనుంది