మాకొద్దీ వెల్ఫేర్ కమిటీలు .. రద్దు చేయాలని ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల వినతులు

మాకొద్దీ వెల్ఫేర్ కమిటీలు .. రద్దు చేయాలని ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల వినతులు
  • యూనియన్లు లేక అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నరని ఆరోపణ
  • తమ సమస్యలపై స్పందించడం లేదంటున్న కార్మికులు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో గత ఐదేండ్లుగా కార్మికులను ఉన్నతాధికారులు చిన్న చిన్న కారణాలతో సస్పెండ్​ చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవటం, లెటర్లు రాసి బస్ లోనూ సూసైడ్​ చేసుకున్న ఘటనలు సైతం ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వంద మందికిపైగా కార్మికులు అనారోగ్యం,  అధికారుల వేధింపులు, పని ఒత్తిడితో, రెస్ట్ రూమ్ లో, డ్రైవింగ్ చేసే టైమ్ లో చనిపోయారు.

అన్నింటిలోనూ ఆఫీసర్ల వేధింపులు, పని ఒత్తిడి కారణాలను చూపిస్తున్నారు. అధికారులు మాత్రం కుటుంబ సమస్యలే కారణమని చెప్తూ తప్పించుకుంటున్నారు. అయితే, ఆర్టీసీలో యూనియన్లు లేకపోవటంతోనే అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  కార్మికుల సస్పెన్షన్లు, వేధింపులు, నోటీసులపై డీఎంలు, ఆర్ ఎం లతో యూనియన్ నేతలు మాట్లాడుతుంటే వారు సీరియస్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. “ఆర్టీసీలో యూనియన్లే లేవు. గత ప్రభుత్వంలోనే రద్దు చేసిన్రు. నువ్ ఎవరు నన్ను అడగటానికి ” అని ఇటీవల ఓ యూనియన్ లీడర్​కు హైదరాబాద్​ సిటీ శివారు డీఎం సమాధానం ఇచ్చారని తెలిసిం ది. 

మంత్రి పొన్నం దగ్గరకు బాధితులు

ఆర్టీసీలో సస్పెన్షన్​కు గురైన వాళ్లు, షోకాజ్ నోటీసులు ఇచ్చి డ్యూటీలు ఇవ్వకుండా పక్కకు పెట్టిన కార్మికులు ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దగ్గరకు వస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి  నిత్యం సోమాజిగూడలోని ఆయన నివాసానికి, సెక్రటేరియెట్ కు వస్తూ తమ సమస్యలను వివరిస్తున్నారు. చిన్న చిన్న తప్పులకు, తమ ప్రమేయం లేని వాటిలో తమ వివరణ తీసుకోకుండా అధికారులు సస్పెండ్​ చేస్తున్నారని మంత్రికి విన్నవిస్తున్నారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సస్పెన్షన్ ఎత్తివేసి, డ్యూటీలు ఇప్పించాలని వేడుకుంటున్నారు. యూనియన్లను గత సీఎం కేసీఆర్ రద్దు చేసినప్పటి నుంచి ఆర్టీసీలో అధికారుల వేధింపులు బాగా పెరిగాయని మంత్రికి ఫిర్యాదు చేస్తున్నారు. త్వరలో ఆర్టీసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇస్తున్నారు.

నామ్ కే వాస్త్​గా వేల్ఫేర్ కమిటీలు

ఆర్టీసీ కార్మికులు 2019లో సమ్మె చేసినప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ యూనియన్లను రద్దు చేసి వాటి స్థానంలో ప్రతి డిపోలో ఇద్దరు లేదా ముగ్గురుతో వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సుమారు 43 వేల మంది ఉండగా.. వారికి ప్రతినిధులుగా ఈ  250 మంది వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు ఉన్నారు. వీరికి అధికారులు కూడా దూర ప్రాంతాలకు డ్యూటీలు ఇవ్వకుండా డ్యూటీలో ఎక్కువ టైమ్ డిపోలో తక్కువ ఉండేలా చేశారని ఆరోపణలు వచ్చాయి.

వీరు కార్మికులతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకోకుండా, డీఎంలు, ఆర్ ఎంలకు చెప్పకుండా నామ్ కే వాస్త్ గా పనిచేశారని కార్మికులు చెబుతున్నారు. ఏనాడు తమతో సమావేశాలు ఏర్పాటు చేయలేదని, డిపో, రీజనల్, జోన్ పరిధిలో ఈ కమిటీల మీటింగ్ లు, తీసుకున్న నిర్ణయాలు, ఉన్నతాధికారులకు ఆ సమస్యలను వివరించటం వంటివి చేయలేదని కార్మికులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాత్రి 9 తర్వాత మహిళా కండక్టర్లకు డ్యూటీలు ఇవ్వొద్దని అప్పటి సీఎం చెప్పినా.. అధికారులు డ్యూటీలు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, రాత్రి 11 గంటల తర్వాత డ్యూటీలు ముగిశాక ఇంటికి వెళ్లటం తీవ్ర ఇబ్బంది అవుతుందని మహిళా కండక్టర్లు వాపోతున్నారు. ఈ  సమస్యపై ఏనాడు వెల్ఫేర్ కమిటీలు దృష్టి పెట్టలేదని చెబుతున్నారు.