- ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్.. ఇందిరా పార్కు వద్ద ధర్నా
- సమస్యలు పరిష్కరించ కుంటే మార్చి 9న సమ్మె నోటీసు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని లేనిచో సమ్మె తప్పదని ఆ సంస్థ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీని వెంటనే విలీనం చేయాలనే డిమాండ్ ను అమలు చేయాలని లేనిచో వచ్చే నెల 9 న సమ్మె నోటీసు ఇస్తామని జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, హన్మంతు ముదిరాజ్, థామస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ వద్ద ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చలో సెక్రటేరియట్ పేరుతో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది ఆర్టీసీ ఉద్యోగుల నినాదాలతో ఇందిరా పార్కు ప్రాంతం మార్మోగిపోయింది.
చలో సెక్రటేరియట్ నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్కు వద్దనే తమ ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల లోపు తమ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టత ఇవ్వని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బస్ కా పయ్యా నై చలేగా నినాదంతో తమ నిరసనను మరింత ఉధృతం చేయాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు.
ఇచ్చిన హామీ అమలు చేయమంటున్నాం..
ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, సంస్థ వేల కోట్ల అప్పుల్లో ఉందని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. సంస్థకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ తమను నిర్లక్ష్యం చేయడంతోనే కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు.
తాము కొత్త డిమాండ్లను ఏమీ కోరడం లేదని, కేవలం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని, దీనిపై సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఇతర శాఖలకు నిధులు కేటాయించిన సర్కార్.. ఆర్టీసీకి మాత్రం కేటాయించకపోవడం చూస్తే సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందనే అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు.
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంఘీభావం
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
