హిందువులు జెన్‌‌‌‌జీని స్ఫూర్తిగా తీసుకోవాలి : బండి సంజయ్‌‌‌‌

హిందువులు జెన్‌‌‌‌జీని స్ఫూర్తిగా తీసుకోవాలి : బండి సంజయ్‌‌‌‌
  •     80 శాతం ఉన్న హిందువుల బోనాలకు రూ.20 కోట్లేనా?: బండి సంజయ్‌‌‌‌ 
  •     దేవుళ్లనూ మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌‌‌‌‌‌‌‌ది.. అందుకే ఆ పార్టీ ఓడిందని కామెంట్‌‌‌‌
  •     పాతబస్తీలో భాగ్యలక్ష్మి, లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

హైదరాబాద్, వెలుగు: జెన్ జీ యువత ఆకాశంలోకి రాకెట్లు పంపడమే కాదు.. సనాతన ధర్మం కోసం బలంగా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హిందువులంతా సంఘటితం కావాలని, జెన్ జీ యువతను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం తాను బరాబర్ ప్రశ్నిస్తానన్నారు. 

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీ బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌‌‌‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.ఆదివారం పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని, లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, ఆ పార్టీ నేతలు మనోహర్ రెడ్డి, సంగప్పతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజలనే కాదు.. దేవుళ్లను కూడా మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌‌‌‌దేనని, అందుకే ఆ పార్టీని ప్రజలు ఓడించారన్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు తాను భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే కేటీఆర్ హేళన చేశారని గుర్తుచేశారు. 

ఈ రోజు కేటీఆర్ కూడా జ్ఞానోదయం కలిగించి, తన దగ్గరకు రప్పించుకున్న మహాశక్తి భాగ్యలక్ష్మి అమ్మవారిదని పేర్కొన్నారు. లాల్ దర్వాజ ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు ఇస్తానని చెప్పి, కేసీఆర్ మోసం చేశారని, అందుకే ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం.. 80 శాతం ఉన్న హిందువుల పండుగ బోనాలకు కేవలం రూ.20 కోట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే లాల్ దర్వాజ ఆలయానికి కాంగ్రెస్ ఇచ్చే రూ.5.50 లక్షలు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. పాతబస్తీలో పన్నులు కట్టేది హిందువులేనని, ఆ పైసలు హిందూ దేవాలయాలకు ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు. 

ఉద్యోగాల హామీ ఏమైంది?

రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనన్న హామీ ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. హైడ్రాలో 150 పోస్టుల కోసం వేల సంఖ్యలో నిరుద్యోగులు రావడం రాష్ట్రంలోని నిరుద్యోగానికి నిదర్శనమన్నారు. మహిళలకు రూ.2,500 మహాలక్ష్మి పథకం, పెన్షన్ల పెంపు వంటి హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్రను ఎందుకు పాఠ్యాంశాల్లో చేర్చలేదని ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ దీపావళి రోజున వెయ్యి మంది మహిళలను, పిల్లలను కాల్చి చంపిన నీచుడని, ఆయనకు కర్నాటకలో విగ్రహం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.