జూలూరుపాడు, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంకు చెందిన నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, బంధువులు, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు బుధవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మృతదేహం పోస్టుమార్టం అనంతరం జూలూరుపాడు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను సముదాయించారు.
ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాస్తారోకో వద్ద ఆగి ఎస్పీ రోహిత్‌రాజ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. హత్యపై సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హరిణి ఇంటికి వెళ్లి పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో హరిణి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
