జ్యోతిష్యం&వాస్తు: ఇంట్లో ఏ దేవుడి ఫొటోలు ఎక్కడ ఉండాలి.. ఏ ఇబ్బందికి ఏ దేవుడిని పూజించాలి..పాటించాల్సిన నియమాలు ఇవే..!

జ్యోతిష్యం&వాస్తు:  ఇంట్లో ఏ దేవుడి ఫొటోలు ఎక్కడ ఉండాలి.. ఏ ఇబ్బందికి ఏ దేవుడిని పూజించాలి..పాటించాల్సిన నియమాలు ఇవే..!

ప్రతి ఇంట్లో దేవుడిని పూజించడానికి ఒక ఆలయం ఉంటుంది. హిందూ కుటుంబాలలోని పూజా గదిలో దేవుళ్ళు , దేవతల చిత్రాలు ఉంటాయి. వాటి ముందు ధూపం కర్రలు లేదా అగర్​ బత్తీలు వెలిగించి పూజలు చేస్తారు. కానీ వాస్తు శాస్త్రంలో,ఇంటి పూజాగదిలో దేవుళ్ళు ,దేవతల ఫొటోలను ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!

జ్యోతిష్యశాస్త్రం, వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో లేదా కుటుంబంలో ఏదైనా వస్తువును ఏర్పాటు చేస్తే, అది ఆనందం, శ్రేయస్సు , సంపదను తెస్తుంది.  పూజాగదిలో దేవుళ్ల , దేవతల ఫొటోల దిశ, పూజాగది పరిమాణం మొదలైనవి ఇంటి ఆనందాన్ని ప్రభావితం చేస్తాయి. మరి దేవతలు, దేవతల చిత్రాలకు సంబంధించిన ఇంట్లో ఏ దేవుడి ఫొటోలు ఉండాలి.. ఆ ఫొటోలు ఎలా ఉండాలి.  ఏ రోజు ఏదేవుడి పటానికి పూజించాలి..

ఇంట్లో నిలబడి ఉన్న లక్ష్మిదేవి చిత్రాన్ని ఉంచకూడదు. కూర్చుని ఉన్న ఫోటోని మాత్రమే ఇంట్లో ఉంచాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. లక్ష్మిదేవి బొమ్మను కాని ఫోటోని గాని దర్వాజాలకు దగ్గరగా ఉంచకూడదు. ఇంకా గృహం వెలుపల అస్సలు ఉంచకూడదు.లక్ష్మిమాత ఫోటోను పూజమందిరంలో ఉంచి పూజించడం చాలా  మంచిదని పండితులు చెబుతున్నారు.
  
వ్యాపారస్తులు చాలామంది వారి వారి వ్యాపారాలకు లక్ష్మిదేవి పేరును పెడతారు. చాలామంది తమ వ్యాపారాల బోర్డ్ లపై లక్ష్మిమాత బొమ్మను ఉంచుతారు. ఇది మంచిది కాదు. ఈ విధంగా చేస్తే ఆ వ్యాపారాలు తీవ్ర నష్టాలకు లోనై  మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. 

తీవ్ర నరఘోషతో బాధపడేవారు శ్రీ లక్ష్మినరసింహస్వామి వారి ఫోటోను గృహంలో ఉంచి ప్రతిరోజు అర్చించాలి. శుక్రవారం రోజు విశేష పూజచేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో ప్రశాంతతను కోరేవారు శ్రీరామపట్టాభిషేకం ఫోటో ను గృహంలో ఉంచాలి. ఇంటి ఎలివేషన్ పై కూడా ఈ ఫోటోను ఉంచాలి.

 భయాలతో బాధపడేవారు శ్రీ ఆంజనేయస్వామి వారి చిత్రాన్ని ఉంచుకోవాలి. శని, మంగళ వారాలలో విశేష పూజ చేయాలి. నెలకు ఒక మంగళవారం అయిన హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం చేయాలి.

సుఖప్రదమైన వివాహ జీవితానికి ఉమామహేశ్వరుల ఫోటోను గృహంలో ఉంచాలి. ఉమా మహేశ్వరుల ఫోటో ను గృహంలో ఉంచి సోమ, శుక్ర వారాలలో విశేషపూజ చేయాలి.

మంచి ఆరోగ్యం కోసం లక్ష్మీనారాయణుల ఫోటోను ఉంచాలి. అదే విధంగా అన్నిటా జయం, సర్వత్ర అభివృద్ది కొరకు శ్రీ లలిత దేవి ఫోటో ను ఉంచి పూజించాలి. ప్రతిరోజూ శ్రీ లలిత దివ్య సహస్రనామ స్తోత్రం గృహంలో పారాయణ చేస్తే సకల మంగళ ప్రదంగా ఉండి, సుఖశాంతులు లభిస్తాయి.

ఇంట్లో దేవుడి పూజామందిరం..  దేవుళ్లు , దేవతల చిత్రాల ముఖాలు తూర్పు దిశ ఉన్న గదిలో ఉండాలి.  దేవుడిని ధ్యానిస్తూ ఉత్తర దిశ వైపు చూస్తూ పూజిస్తే, అతనికి సానుకూల ఆశీర్వాదాలు లభిస్తాయని  పండితులు చెబుతున్నారు.

వాస్తు నియమాల ప్రకారం, ఇంట్లో పూజా గదికి సరైన దిశ ఇంటి తూర్పు దిశ . శాస్త్రీయంగా తూర్పు దిశలో సూర్యుడు ఉదయిస్తాడు. ఈ దిశలో  సూర్యుడు ఉదయించినప్పుడు వచ్చే  కాంతి పూజా గది గుండా వెళితే అది చాలా మంచిదని..  శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

విష్ణువు, లక్ష్మీ దేవి చిత్రపటాన్ని ఈశాన్యంలో.. సాయిబాబా చిత్రాన్ని వాయువ్య దిశలో ఉంచాలి. విష్ణువు, సాయిబాబాలు బృహస్పతి శక్తిని పెంచుతారు. దీని కారణంగా జ్ఞానంతో పాటు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

ఉత్తరాన గణేశుడు, ఈశాన్యంలో దుర్గామాత చిత్రాన్ని ఉంచడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. దీని కారణంగా బుదుడు స్థానం సానుకూలంగా మారుతుంది. బుద గ్రహం అదృష్టానికి కేరాఫ్‌గా చెబుతారు.జ్యోతిష్యం ప్రకారం బుదుడి అనుగ్రహం కలిగితే.. విద్య, వ్యాపారంలో పురోగతి లభిస్తుంది.

శివుడు, పార్వతి దేవి విగ్రహం లేదా ఫోటో ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా చేయడం వలన చంద్రుని శక్తి పెరిగి.. ఇంట్లో సంతోషం పెరుగుతుంది.హనుమంతుని చిత్రపటాన్ని ఆగ్నేయంలో ఉంచాలి. దీంతో బలం పెరిగి, ఆనందం పెరుగుతుంది. చంద్రుడు, శుక్రుడి శక్తిని పెంచే ఈశాన్య భాగంలో రాధా కృష్ణుడి చిత్రాన్ని ఉంచాలి. దీంతో ఆనందం, శాంతి పెరుగుతాయి

దేవుని విగ్రహాలను గృహంలో ఉంచితే నిత్యపూజ తప్పనిసరి. 6 అంగుళాల లోపు ఉండే విగ్రహాలు పెట్టుకోవచ్చు. చిన్న చిన్న దేవుని విగ్రహాలు ఇంట్లో ఉండవచ్చు. అయితే పెద్ద విగ్రహాలను ఇంట్లో ఉంచరాదు. శని సింగన పూర్ నుండి తెచ్చిన శని యంత్రాలు ఇంట్లో ఉంచరాదు. నాడా, నల్లని విగ్రహం .ఇంట్లో ఉంచుకోకూడదు. ఈ నియమాలు పాటించి ఇంట్లో ఈ విధంగా గృహంలో దేవుని ఫోటోలు, విగ్రహాలు పెట్టుకొంటే మంచి అభివృద్ది ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.