జూన్ 1న ఇందిరా పార్కు వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్ష

జూన్ 1న ఇందిరా పార్కు వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్ష
  • టీజేఎంయూ పిలుపుకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య మద్దతు
  • ఈ నెల 31న అన్ని డిపోలలో ‘డిమాండ్ డే’ పాటించాలని జేఏసీ పిలుపు
  • సీఎం రేవంత్ రెడ్డితో విలీన ప్రకటన చేయించాలని వేం నరేందర్ రెడ్డికి వినతి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ విలీనం విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా జూన్ 1న హైదరాబాద్​లోని ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్షకు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) పిలుపునిచ్చింది. ఈ మేరకు యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందని, విలీనం కోరుకునే కార్మికులు, ఆయా యూనియన్లు ఇందులో భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ దీక్షకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మద్దతు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఎన్నికలు వద్దు, విలీనం జరగాలని ఆర్టీసీ ఎండీకి అన్ని యూనియన్లు లేఖలు ఇచ్చిన విషయాన్ని హన్మంతు ముదిరాజ్ గుర్తు చేశారు.

అందుకు సీఎం అంగీకరించినా.. రెండు రోజుల క్రితం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటన ప్రభుత్వ ద్వంద్వ విధానాలను తెలియజేస్తోందని మండిపడ్డారు. ముందుగా ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాతనే విలీనం అని మంత్రి చేసిన ప్రకటన కార్మికుల ఆశలపై నీళ్లు చల్లిందని, విలీనం విషయంలో ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. 

వేం నరేందర్ రెడ్డితో జేఏసీ నేతల భేటీ

మరోవైపు ఆర్టీసీ జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, యాదయ్య, సురేశ్, యాదగిరి.. గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డితో విలీన ప్రకటన చేసేలా సహకరించాలని కోరారు. దీనికి వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. జూన్ 2న అపాయింటెడ్ డేట్ ప్రకటన చేసేలా, విలీన విధివిధానాల కోసం అధికారులతో పాటు కార్మిక సంఘాలతో కమిటీ వేసేలా చర్యలు తీసుకుంటామని, విలీనం కోసం వేగవంతమైన చర్యలకు తనవంతు కృషి చేస్తానని వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు.

నేడు ఉద్యమ కార్యాచరణ ప్రకటన

విలీన ప్రకటన కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే శుక్రవారం జేఏసీ సమావేశమై ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తుందని ఆ సంఘం నేతలు తెలిపారు. ఇప్పటికే ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలలో కార్మికులు ‘డిమాండ్ డే’గా పాటించాలని జేఏసీ పిలుపునిచ్చింది.