జ్యోతిష్యుడితో లింకులు.. అను మాలిక్ వివాదం: పదవికి గుడ్ బై చెప్పిన రూపాలి చాకన్కర్ !

జ్యోతిష్యుడితో లింకులు.. అను మాలిక్ వివాదం: పదవికి గుడ్ బై చెప్పిన రూపాలి చాకన్కర్ !

జ్యోతిష్యుడు అశోక్ ఖరత్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌సీపీ (NCP) కీలక నాయకురాలు రూపాలి చాకన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె ఇది వరకే రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

సమాచారం ప్రకారం అరెస్ట్ అయిన జ్యోతిష్యుడు అశోక్ ఖరత్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని ఎన్‌సీపీ కార్యకర్తలు ఆమెను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

  "ఆ జ్యోతిష్యుడి తప్పుడు పనులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాపై వస్తున్న ఆరోపణలు బాధాకరం. ఈ కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగాలని నేనే ముఖ్యమంత్రిని కోరాను" అని ఆమె స్పష్టం చేశారు. ఆమె తన రాజీనామా లేఖను ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ అధినేత సునేత్రా పవార్‌కు పంపారు.
 
మరోవైపు శివసేన (UBT) నాయకురాలు సుష్మా అంధారే ఆమెపై మరో సంచలన ఆరోపణ చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఉన్న సంగీత దర్శకుడు అను మాలిక్‌కు రూపాలి క్లీన్ చిట్ ఇచ్చారని, దానికి బదులుగా అను మాలిక్ తన సినిమాలో రూపాలి కొడుకు  సోహమ్ చాకన్కర్ కు అవకాశం ఇచ్చారని సుష్మా అంధారే విమర్శించారు.
 
ఈ ఆరోపణలను అను మాలిక్ కొట్టిపారేశారు. "నేను ఎవరికీ సినిమా అవకాశం ఇవ్వలేదు. నాకు మొదట జాతీయ మహిళా కమిషన్ నుండి, ఆ తర్వాతే రాష్ట్ర మహిళా కమిషన్ నుండి క్లీన్ చిట్ లభించింది. నేనే తప్పూ చేయలేదు" అని ఆయన వివరణ ఇచ్చారు. వరుస వివాదాలు, పార్టీ కార్యకర్తల ఒత్తిడి కారణంగా రూపాలి చాకన్కర్ తన పదవుల నుండి తప్పుకోవాల్సి వచ్చింది.