ముందు మీ ట్రాక్ రికార్డ్ చూసుకోండి: కాంగ్రెస్‎పై బీజేపీ కౌంటర్ అటాక్

ముందు మీ ట్రాక్ రికార్డ్ చూసుకోండి: కాంగ్రెస్‎పై బీజేపీ కౌంటర్ అటాక్

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో కుమ్మక్కై బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతోందని.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ బీజేపీ కార్యకర్తలా పని చేస్తున్నాడంటూ కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలపై బీజేపీ ఎదురు దాడి మొదలుపెట్టింది. ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల కమిషనర్లను గత కాంగ్రెస్ ప్రభుత్వమే రాజకీయ లబ్ధి కోసం వాడుకుందని కౌంటర్ ఇచ్చింది. తమకు అనుకూలంగా పనిచేసిన ఎన్నికల కమిషనర్లను పదవులు, అవార్డులతో ప్రలోభ పెట్టిందని ఆరోపించింది. 

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం (అక్టోబర్ 13) ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో మాజీ సీఈసీ ఎం.ఎస్. గిల్‎కు పదవిలో ఉండగానే పద్మవిభూషణ్ అవార్డ్ అందించారని గుర్తు చేశారు. ఇది ఒక రకమైన లంచం లేదా ప్రలోభం కాదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే, మరో మాజీ సీఈసీ టి.ఎన్. శేషన్‎కు పదవి కాలం ముగిసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. 

మరో ఇద్దరు మాజీ సీఈసీలను కాంగ్రెస్ గవర్నర్లుగా నియమించిందని  ఆరోపించారు. అధికారం కోల్పోవడంతో ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ మొదట తమ సొంత ట్రాక్ రికార్డ్‌ను చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. 

రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు:

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు గుప్పించారు. రాహల్ గాంధీవి పిల్లచేష్టలు అని ఎద్దేవా చేశారు. రాజ్యంగబద్ధ సంస్థలపై నిరాధార, రాజకీయ లబ్ధి కోసం రాహుల్ చేస్తోన్న ఆరోపణలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయనిమండిపడ్డారు. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. 

►ALSO READ | మారనున్న ధారావి రూపరేఖలు: 22 ఎకరాల్లో 10 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం షురూ

ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస ఓటములకు రాహుల్ గాంధీయే ప్రధాన కారణమని అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఒర రెడ్ ఫ్లాగ్ అని అభివర్ణించారు. గెలిస్తే తమ ఘనత.. ఓడితే ఈసీపై అబండాలు వేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలపై రాజకీయాన్ని నిర్మించలేరని.. దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారని చురకలంటించారు.