యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం హాలిడే కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసిన భక్తుల కోలాహలమే కనిపించింది.
మరోవైపు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 11 రోజుల నుంచి రద్దైన ఆర్జిత ఆదివారం తిరిగి ప్రారంభం కావడంతో స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం లాంటి ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉచిత దర్శానానికి మూడు గంటలు, స్పెషల్ దర్శానానికి గంట సమయం పట్టింది. ఇక ఆలయంలో నిత్యపూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాత సేవతో మొదలై రాత్రి పవళింపు సేవతో ముగిశాయి.
నారసింహుడి సేవలో ప్రముఖులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి ఆయోధ్యరెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వేర్వేరుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి గర్భగుడిలో స్వయంభు నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించుకున్నారు.
అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వారికి వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఏఈవో నవీన్, సూపరింటెండెంట్ రాజన్ బాబు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు.
