జోరుగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల దందా.. రూ. 2 లక్షల విలువైన సిగరెట్లు స్వాధీనం

జోరుగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల దందా.. రూ. 2 లక్షల విలువైన సిగరెట్లు స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: ఎలక్ట్రానిక్ సిగరెట్లు అమ్ముతున్న ఆరుగురిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను మంగళవారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్, ఏసీపీలు నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రావుతో కలిసి వెల్లడించారు. బోరబండ ప్రాంతానికి చెందిన కె. జగదీశ్ రెడ్డి(65) జీరో 40 పబ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. 
చార్మినార్​కు చెందిన మహ్మద్ జిబ్రాన్(27) కొండాపూర్​లోని శ్రీరాంనగర్​లో లక్కీ కలెక్షన్ పేరుతో పాన్ షాప్ నడుపుతున్నాడు. ఓల్డ్ హఫీజ్ పేటకు చెందిన ఎండీ ముక్రం(32), మాదాపూర్ సిద్ధిఖ్​నగర్ కు చెందిన కె. నాథురాం(30)తో కలిసి అదే ఏరియాలో ఘనీ పేరుతో పాన్ షాప్ ను రన్ చేస్తున్నాడు. అయితే, రాజస్థాన్ కు చెందిన శర్మ అనే వ్యక్తి కోల్ కతా నుంచి ఈ– సిగరెట్లను సిటీకి తీసుకొచ్చి పబ్ మేనేజర్ జగదీశ్ రెడ్డికి, ఈ రెండు పాన్​షాపులకు సప్లయ్ చేసేవాడు.
 జిబ్రాన్, ముక్రం, నాథురాం తమ పాన్ షాపులకు వచ్చే ఐటీ ఎంప్లాయీస్, ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్లకు సిగరెట్లను అమ్మేవారు. అదే విధంగా జగదీశ్ రెడ్డి సైతం పబ్​కు వచ్చే కస్టమర్లలో తనకు బాగా తెలిసిన వారికి వీటిని అమ్మేవాడు. వీళ్లంతా ఒక్కో ఎలక్ట్రానిక్ సిగరెట్ ను రూ.500 నుంచి 5 వేల వరకు అమ్మేవారు. స్కూల్ స్టూడెంట్లు ఈ– సిగరెట్లు తాగుతూ ఇటీవల పట్టుబడగా గచ్చిబౌలి పోలీసులు నిఘా పెట్టారు.
 మూడు టీమ్స్ గా ఏర్పడి మంగళవారం శ్రీరాంనగర్​లోని ఈ రెండు పాన్ షాపులపై దాడులు చేశారు. జిబ్రాన్​తో పాటు అతడి షాపులో పనిచేసే  గోల్కొండకు చెందిన సమీర్(19), న్యూ హఫీజ్ పేటకు చెందిన ఫరీన్ ఖాన్(19)ను, ఘనీ పాన్ షాప్ నిర్వాహకులు ముక్రం, నాథురాంను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా పబ్ మేనేజర్ జగదీశ్ రెడ్డిని సైతం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల విలువైన 99 ఎలక్ట్రానిక్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.