ఉక్రెయిన్ బార్డర్ నుంచి రష్యా సైన్యం వాపస్

ఉక్రెయిన్ బార్డర్ నుంచి రష్యా సైన్యం వాపస్

మాస్కో: ఉక్రెయిన్​తో యుద్ధ పరిస్థితులు దాదాపు ముగిసిపోయినట్టేనని రష్యా ప్రకటించింది. క్రిమియాలో చేపట్టిన మిలటరీ డ్రిల్స్​ పూర్తయిపోయాయని, బలగాలు పూర్తిగా వెనక్కు వచ్చేస్తున్నాయని ఆ దేశ రక్షణ శాఖ బుధవారం ప్రకటించింది. సైన్యం, ఆయుధాలన్నీ సదరన్​ రష్యాలోని బేస్​కు చేరుకుంటున్నాయని తెలిపింది. యుద్ధ ట్యాంకులు, సైన్యాన్ని 
తరలించే వెహికల్స్​, సెల్ఫ్​ ప్రొపెల్డ్​ ఇన్​స్టాలేషన్స్​ను రైళ్లలో బేస్​లకు పంపిస్తున్నట్టు వెల్లడించింది. ఉక్రెయిన్​ సరిహద్దుల్లో మోహరించిన లక్షన్నరకు పైగా బలగాలను రష్యా మంగళవారం వెనక్కు తీసుకొచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం పూర్తిగా బలగాలను వెనక్కు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. సైన్యం వెనక్కు వెళ్లిపోతున్న వీడియోలను 
విడుదల చేసింది.    

బలగాల వాపస్​ డౌటే: నాటో

బలగాలన్నింటినీ వాపస్​ తీసుకొస్తున్నట్టు రష్యా ప్రకటించినా నార్త్​ అట్లాంటిక్​ ట్రీటీ ఆర్గనైజేషన్​ (నాటో) మాత్రం అనుమానాలను వ్యక్తం చేసింది. ఎక్కడా బలగాల వాపస్​ అన్నది తమకు కనిపించడం లేదని, ఉక్రెయిన్​ మీద దాడి జరిగే ముప్పు ఇంకా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ రష్యా చెప్తున్నట్టు బలగాలు వెనక్కు వచ్చేస్తే మంచిదేనని, కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితులేవీ కనిపించడం లేదని నాటో సెక్రటరీ జనరల్​ జెన్స్​ స్టోల్టెన్​బర్గ్​ అన్నారు. ఉక్రెయిన్​సహా నాటోలోని దేశాలు అదే డౌట్​ను వ్యక్తం చేశాయి.  

ముప్పు ఇంకా పోలే: బైడెన్​

ఉక్రెయిన్​ మీద రష్యా దాడి చేసే ముప్పు ఇంకా పోలేదని, దాడి చేసే అవకాశాలు ఇంకా ఉన్నాయని అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​ ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమాటిక్​ చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని, కాదని దాడి చేస్తే రష్యాపై ఆంక్షలు పెట్టేందుకూ వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. 

మేమూ యుద్ధాన్ని కోరుకోవట్లేదు: పుతిన్​

రష్యా కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదని రష్యా ప్రెసిడెంట్​ వ్లాదిమిర్​ పుతిన్​ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులపై జర్మనీ చాన్స్​లర్​ ఓలాఫ్​ షోల్జ్​తో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డిప్లొమాటిక్​ చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా యూరప్ పై మిసైల్స్​ నిషేధం, మిలటరీ డ్రిల్స్​ మీద ఆంక్షలు వంటి విషయాలపై చర్చించేందుకు ఎన్నో ఏండ్లుగా ప్రయత్నిస్తున్నా సాధ్య పడడం లేదన్నారు. వాటికి ఓకే అంటే ఈ సమస్యపైనా చర్చించేందుకు సిద్ధమేనని
 స్పష్టం చేశారు.  

ప్రశాంతంగా బతకాలనుకుంటున్నం: ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​

దేశంపై రష్యా దండెత్తి వచ్చే ప్రమాదం ఉందంటూ కొందరు అధికారులు సమాచారం ఇచ్చారని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ వొలోదిమిర్​ జెలెన్​స్కీ ప్రకటించారు. తాము ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా బతకాలని అనుకుంటున్నామని చెప్పారు. బుధవారం నేషనల్​ యూనిటీ డే సందర్భంగా 200 మీటర్ల పొడవైన జెండాను ప్రజలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అందరం కలిసికట్టుగా ఉంటేనే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టగలమని జనానికి సూచించారు. కాగా, దేశమంతటా ఉక్రెయిన్​ బలగాల ఎక్సర్​సైజులు కొనసాగుతూనే ఉంటాయని ఆ దేశ రక్షణ మంత్రి ఒలెస్కీ రెజ్నికోవ్​ చెప్పారు. గురువారం జరగబోయే నాటో డిఫెన్స్​ మినిస్టర్ల సమావేశంలో పాల్గొంటానని స్పష్టం చేశారు.