ఇండోకు గుడ్‌బై.. మళ్లీ పసిఫిక్ కమాండ్ గా పేరు మార్పు..చర్చనీయాంశంగా ట్రంప్ నిర్ణయం

ఇండోకు గుడ్‌బై.. మళ్లీ పసిఫిక్ కమాండ్ గా పేరు మార్పు..చర్చనీయాంశంగా ట్రంప్ నిర్ణయం

వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన తన ఫేమస్ సైనిక విభాగంలోని ‘యూఎస్‌‌‌‌‌‌‌‌ ఇండో-పసిఫిక్‌‌‌‌‌‌‌‌ కమాండ్‌‌‌‌‌‌‌‌’ పేరును తిరిగి ‘యూఎస్‌‌‌‌‌‌‌‌ పసిఫిక్‌‌‌‌‌‌‌‌ కమాండ్‌‌‌‌‌‌‌‌’గా మార్చింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సైనిక విభాగానికి ఉన్న సుదీర్ఘ వారసత్వాన్ని, చారిత్రక మూలాలను గౌరవించేందుకే మళ్లీ పాత పేరును పెట్టినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ 1947 జనవరి 1న యూఎస్‌‌‌‌‌‌‌‌ పసిఫిక్‌‌‌‌‌‌‌‌ కమాండ్‌‌‌‌‌‌‌‌ స్థాపించారు. 

ఇది అమెరికా సైన్యంలోనే అత్యంత పాతదిగా, అతిపెద్ద విభాగంగా గుర్తింపు పొందింది. అమెరికా వెస్ట్‌‌‌‌‌‌‌‌ కోస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి భారత పశ్చిమతీరం వరకు గత ఏడు దశాబ్దాలకు పైగా ఈ కమాండ్‌‌‌‌‌‌‌‌ సేవలందిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రాంతీయ స్థిరత్వంలో ఈ దళం కీలక పాత్ర పోషించింది. కొరియన్‌‌‌‌‌‌‌‌, వియత్నాం యుద్ధాల్లోనూ పనిచేసింది. ఎన్నో మానవతా ఆపరేషన్లను చేపట్టింది. అయితే, ట్రంప్‌‌‌‌‌‌‌‌ తొలి దఫా అధికారంలో ఉన్న టైం(2018)లో ‘యూఎస్‌‌‌‌‌‌‌‌ పసిఫిక్‌‌‌‌‌‌‌‌ కమాండ్‌‌‌‌‌‌‌‌’ పేరును  ‘యూఎస్‌‌‌‌‌‌‌‌ ఇండో-పసిఫిక్‌‌‌‌‌‌‌‌ కమాండ్‌‌‌‌‌‌‌‌’గా మార్చారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌‌‌‌‌‌‌‌ మహా సముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి దీని పేరులో ‘ఇండో’ అనే పదం చేర్చినట్లు వెల్లడించారు.

అమెరికా తీరుపై పెరుగుతున్న అనుమానాలు

అమెరికా తన కమాండ్ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తొలగించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆసియాలో అమెరికా వ్యూహాత్మక ప్రాధాన్యతలు మారుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు పసిఫిక్ కమాండ్ పరిధిని సూచిస్తూ విడుదల చేసిన మ్యాప్​లో పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ను పాకిస్తాన్​లో భాగంగా చూపించడం వివాదాస్పదంగా మారింది. ఇది భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన ‘క్వాడ్’ కూటమి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన మొదలైంది.

అమెరికా అధికారులు మాత్రం ఈ అనుమానాలను కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం సాంకేతికమైన పేరు మార్పు మాత్రమేనని చెప్పారు. ‘ఇండో’ అనే పదాన్ని తొలగించినప్పటికీ.. భారత్, జపాన్, ఆస్ట్రేలియా వంటి తమ మిత్రదేశాల రక్షణ విషయంలో అమెరికా వెనకడుగు వేయదని స్పష్టం చేశారు.