కీవ్పై రష్యా భీకర దాడి..600 డ్రోన్లు, 90 మిసైళ్లతో విరుచుకుపడ్డ రష్యా

కీవ్పై రష్యా భీకర దాడి..600 డ్రోన్లు, 90 మిసైళ్లతో విరుచుకుపడ్డ రష్యా
  • నలుగురు మృతి.. 83 మందికి గాయాలు
  • జనావాసాలపై దాడి అమానుషం.. పుతిన్​పై జెలెన్ స్కీ ఫైర్

కీవ్:ఉక్రెయిన్ రాజధాని కీవ్​నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది. దీంతో కీవ్ నగరమంతా భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. నాలుగేళ్లుగా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇటీవల దాడులు కాస్త తగ్గుముఖం పట్టగా.. రష్యా ఆక్రమిత భూభాగంపై శుక్రవారం ఉక్రెయిన్ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగానే శనివారం దాడులు చేపట్టినట్లు రష్యా పేర్కొంది. 

అర్ధరాత్రి సమయంలో ఏకంగా 6 వందలకు పైగా డ్రోన్లు, 90 మిసైళ్లతో కీవ్ సిటీపై దాడి చేసింది. శబ్ద వేగానికి పది రెట్లు వేగంగా దూసుకెళ్లే ఒరెష్నిక్ మిసైల్​ను రష్యా ఈ దాడిలో ఉపయోగించింది. ఈ భీకర దాడిలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా కాలి బూడిదయ్యింది. దీంతో నలుగురు చనిపోయారని, 83 మంది గాయపడ్డారని కీవ్ అధికారులు తెలిపారు. నగరంలో పలుచోట్ల బిల్డింగ్​లు పాక్షికంగా ధ్వంసమయ్యాయన్నారు. 

ప్రసిద్ధ ‘మ్యూజియం ఆఫ్ చెర్నోబిల్’ భవనంతో పాటు, ఒక పాఠశాల భవనం కూడా ఈ దాడిలో పాక్షికంగా అగ్నికి ఆహుతైందని చెప్పారు. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ శాయశక్తులా ప్రయత్నించి దాదాపు 549 డ్రోన్లు, 55 మిస్సైళ్లను గాల్లోనే అడ్డుకున్నప్పటికీ, రష్యా ప్రయోగించిన సరికొత్త హైపర్​ సోనిక్ మిసైల్​ విధ్వంసం సృష్టించింది. 

కీవ్ నగర పరిధిలోని బిలా త్సెర్క్వా ప్రాంతాన్ని ఈ మిస్సైల్ తాకినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ధ్రువీకరించారు. జనావాసాలను టార్గెట్ చేసి దాడులు చేయడం అమానుషమంటూ రష్యాపై ఆయన మండిపడ్డారు.

ఒరెష్నిక్  ప్రత్యేకత..

రష్యన్ భాషలో ‘ఒరెష్నిక్’ అంటే ‘హాజెల్‌‌నట్ చెట్టు’ అని అర్థం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఈ క్షిపణిని అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా అభివర్ణించారు. ఈ మిసైల్ మ్యాక్ 10 వేగంతో అంటే.. ధ్వని కంటే పది రెట్ల వేగంతో దూసుకెళ్లగలదు. పుతిన్ మాటల్లో చెప్పాలంటే ఇది ఆకాశం నుంచి ఒక ‘ఉల్క’ లాగా దూసుకొస్తుంది. 

ప్రస్తుత ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా దీనిని అడ్డుకోలేదు. అణుబాంబులనూ మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. భూగర్భంలో 3 నుంచి 4 అంతస్తుల లోతులో ఉండే బంకర్లను సైతం ఇది సులువుగా ధ్వంసం చేస్తుంది. ఈ క్షిపణిని సాధారణ ఆయుధాలతో ప్రయోగించినా.. అది సృష్టించే విధ్వంసం అణుదాడితో సమానంగా ఉంటుందని రష్యా హెచ్చరిస్తోంది.