ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడి..11 మంది మృతి,53 మందికి గాయాలు

ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడి..11 మంది మృతి,53 మందికి గాయాలు
  • యుద్ధం కొనసాగించాలనేదే రష్యా ఉద్దేశం: జెలెన్‌‌‌‌స్కీ

కీవ్: ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా వందలాది డ్రోన్లు, మిసైళ్లతో దాడికి పాల్పడింది. ఆదివారం అర్ధరాత్రి కీవ్, ఖార్కివ్, ద్నిప్రో నగరాలే లక్ష్యంగా ఎటాక్ చేసింది. ఈ దాడుల్లో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో, గాయపడినవారిలో ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలే ఉన్నారు. ఈ దాడిలో కీవ్‌‌‌‌లోని 11వ శతాబ్దానికి చెందిన ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన చర్చి 'కీవ్- పెచెర్స్క్ లావ్రా' తీవ్రంగా దెబ్బతింది. డ్రోన్ల దాడితో ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలోని ‘డోర్మిషన్ కేథడ్రల్’ పైకప్పుపై మంటలు చెలరేగాయి. కేవలం 30 నిమిషాల పాటు కీవ్‌‌‌‌లోని నివాస భవనాలు, మార్కెట్లు, కిరాణా దుకాణాలపై రష్యా బాంబుల వర్షం కురిపించి విధ్వంసం సృష్టించింది.

70 మిసైల్స్, 611 డ్రోన్‌‌‌‌లతో ఎటాక్

 దాడి కోసం రష్యా ఏకంగా 70 క్షిపణులను, 611 డ్రోన్‌‌‌‌లను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళ అధికారులు వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తంగా వ్యవహరించి 50 మిసైళ్లను, 582 డ్రోన్‌‌‌‌లను ఆకాశంలోనే పేల్చేశాయని వివరించారు. అయినప్పటికీ.. సుమారు 20 బాలిస్టిక్ క్షిపణులు, 27 డ్రోన్లు దేశవ్యాప్తంగా 42 ప్రాంతాల్లోని పౌర స్థావరాలపై పడ్డాయని అధికారులు తెలిపారు.ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌స్కీ తీవ్రంగా స్పందించారు. యుద్ధాన్ని కొనసాగించాలనే తన క్రూరమైన ఉద్దేశాన్ని రష్యా తన దాడితో బయటపెట్టిందని మండిపడ్డారు. 

పురాతనమైన చర్చిపై జరిగిన దాడిని క్రైస్తవ సంస్కృతికి వ్యతిరేకంగా రష్యా చేసిన అతిపెద్ద నేరంగా అభివర్ణించారు. రష్యాను కంట్రోల్ చేయడానికి జీ7 దేశాలు ముందుకు రావాలని, ఉక్రెయిన్‌‌‌‌కు మరిన్ని యాంటీ-బాలిస్టిక్ వైమానిక రక్షణ వ్యవస్థలను అందించి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ఉక్రెయిన్ ఆరోపణలను రష్యా రక్షణ శాఖ  తోసిపుచ్చింది. 

తాము కేవలం ఉక్రెయిన్ సైనిక, డ్రోన్ తయారీ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పింది. ఆధ్యాత్మిక క్షేత్రంపై దాడి తాము చేయలేదని, ఉక్రెయిన్ ఉపయోగించిన అమెరికా నిర్మిత ‘పేట్రియాట్’ క్షిపణి దారి తప్పి దానిపై పడి ఉంటుందని పేర్కొంది. శనివారమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ విడివిడిగా ఫోన్‌‌‌‌లో మాట్లాడారు. అది జరిగిన మరుసటి రోజే రష్యా ఈ దాడులు జరపడం గమనార్హం.