V6 News

డిస్కంల వాటాలు తేలినయ్..రైతు డిస్కం వాటా 42 శాతం  

డిస్కంల వాటాలు తేలినయ్..రైతు డిస్కం వాటా 42 శాతం  
  • 71 నుంచి 45 శాతానికి పడిపోయిన సౌత్ డిస్కం 
  • 13 శాతంతో అతి చిన్న డిస్కంగా ఎన్పీడీసీఎల్‌‌‌‌
  • ఈ వాటాల ఆధారంగానే ఉద్యోగుల సర్దుబాటు
  • జూన్ 2 నుంచి అధికారికంగా మొదలు కానున్న రైతు డిస్కం సేవలు 
  • ముమ్మర ఏర్పాట్లలో సీఎండీ  ఫారూఖ్​ అలీ

హైదరాబాద్, వెలుగు:   రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కం​ వాటా 42 శాతంగా తేలింది. దీని వల్ల ఇప్పటికే ఉన్న ఎస్పీడీసీఎల్​(దక్షిణ విద్యుత్​ పంపిణీ సంస్థ) వాటా 71 నుంచి 45 శాతానికి, ఎన్పీడీసీఎల్(ఉత్తర విద్యుత్​ పంపిణీ సంస్థ)​వాటా 29 నుంచి13 శాతానికి పడిపోయాయి. రాష్ట్రంలో గడిచిన ఐదేండ్ల విద్యుత్​ వినియోగం ఆధారంగా ఈ వాటాలు తేల్చగా,  ఎస్పీడీసీఎల్​, రైతు డిస్కంలు మొదటి రెండు స్థానాల్లో నిలవగా, ఎన్పీడీసీఎల్  అతి చిన్న డిస్కంగా అవతరించింది.   రైతు డిస్కం సేవలు జూన్​ 2 నుంచి అధికారికంగా మొదలు కానున్నాయి.

సీఎండీ ముషారఫ్​ అలీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  మూడో డిస్కంకు సంబంధించిన పేపర్​ వర్క్​ ఇప్పటికే పూర్తి కాగా,  కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘మినిస్ట్రీ ఆఫ్​ కార్పొరేట్​ అఫైర్స్’​ నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. డిస్కం లైసెన్స్​ కోసం తెలంగాణ ఈఆర్​సీలో అప్లయ్ ​చేయగా, ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించిన విధివిధానాలపై కసరత్తు జరుగుతున్నది.

 వాటాల ఆధారంగానే ఉద్యోగుల సర్దుబాటు

రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎన్పీడీసీఎల్​(నార్త్​), ఎస్పీడీసీఎల్​ (సౌత్​) విద్యుత్​ పంపిణీ సంస్థలు మాత్రమే ఉండేవి. హైదరాబాద్​ కేంద్రంగా సౌత్​, వరంగల్​ కేంద్రంగా నార్త్​ డిస్కంలు పనిచేసేవి. రైతు డిస్కం ఏర్పాటు చేయకముందు  సౌత్​  డిస్కం వాటా 71 శాతం ఉండగా, నార్త్​ డిస్కం వాటా 29 శాతంగా ఉండేది.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఈ రెండు డిస్కంల పరిధిలో ఉన్న 29,05,779 వ్యవసాయ ఉచిత విద్యుత్​ కనెక్షన్లు ,  489 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌‌‌(ఎల్ఐఎస్​) కనెక్షన్లు,  99 హైదరాబాద్​ జలమండలి, 1,132 మిషన్  భగీరథ , మున్సిపాలిటీల పరిధిలోని ప్రత్యేక 639  డీటీఆర్‌‌‌‌‌‌‌‌ల నీటి కనెక్షన్లు  కలిపి 29.08 లక్షల విద్యుత్​ కనెక్షన్లను కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కం పరిధిలోకి తెచ్చింది. 2021 నుంచి 2025 వరకు రాష్ట్రంలో జరిగిన విద్యుత్​ వినియోగం ఆధారంగా ఈ 3 డిస్కంల  వాటాలను అధికారులు లెక్కకట్టారు. ఈవాటాల ఆధారంగానే ఉద్యోగుల సర్దుబాటు చేయనున్నారు. 

జిల్లాకో డీఈ, ఉమ్మడి జిల్లాకో ఎస్ఈ

జూన్​ 2 నుంచి రైతు డిస్కం​ సేవలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లాకో డివిజనల్​ ఇంజినీర్​(డీఈ), ఉమ్మడి జిల్లాకో సూపరిండెంట్​ఇంజినీర్​ (ఎస్ఈ) స్థాయి అధికారులకు బాధ్యతలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డివిజన్​పరిధిలో ఏడీఈ, సబ్​ డివిజన్​ పరిధిలో ఏఈలను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎండీ ముషారఫ్​ అలీ ఫారూఖీ రైతు డిస్కంలో ఉద్యోగుల నియామకంపై ఫోకస్ ​పెట్టారు. ఇప్పటికే డైరెక్టర్ల బోర్డు ఏర్పాటు కాగా, కమర్షియల్, ఆపరేషన్ అండ్​ మెయింటెనెన్స్, అకౌంట్స్, ఐటీ​ విభాగం, రెగ్యులేటరీ, పవర్​ పర్చేస్​ అగ్రిమెంట్‌‌‌‌లాంటి పనులు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 660 మంది ఇంజినీర్లు, వెయ్యి మంది సిబ్బంది, 340 మంది పరిపాలనా ఉద్యోగులను నియమించాల్సి ఉంది.  

రైతు డిస్కంలో పనిచేయడానికి టీజీ ట్రాన్స్‌‌‌‌ కో, జెన్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్​ కింద పనిచేస్తున్న ఉద్యోగులను పదోన్నతుల ద్వారా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం సీఎండీ ముషారఫ్​ ఇప్పటికే విద్యుత్​ యూనియన్లతో 2 సార్లు మీటింగ్‌‌‌‌లు పెట్టారు. రైతు డిస్కంలో చేరిన ఉద్యోగులకు ఏప్రిల్​ 1న జీతాలు అందించి ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచారు.

ముఖ్యంగా సౌత్​, నార్త్​ డిస్కంలలో పర్మినెంట్​ ఉద్యోగులు, ఆర్టిజన్లు కలిపి సుమారు 34 వేల మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. ఈ రెండు డిస్కంల నుంచి రైతు డిస్కంలో చేరడానికి ఉద్యోగులు, ఆర్టిజన్లు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇంజినీర్లు చెప్తున్నారు. 

ఉద్యోగుల నియామకంపై దృష్టి సారించినం 

రైతు డిస్కం సేవలు జూన్​ 2 నుంచి  మొదలు కానున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్నాం. కంపెనీ రిజిస్ట్రేషన్​, జీఎస్టీ, టిన్​, పిన్​ నెంబర్లు అన్నీ వచ్చేశాయి. ఏప్రిల్​ 1న ఉద్యోగులకు రైతు డిస్కం నుంచే జీతాలు చెల్లించినం. త్వరలోనే ఈఆర్​సీ లైసెన్స్​ వస్తుంది.   ఖరీఫ్​ సీజన్​ మొదలయ్యేలోపే ఉద్యోగుల సర్దుబాటు పూర్తిచేస్తాం. జిల్లాలు, డివిజన్లవారీగా ఉద్యోగులను నియమించి కార్యాలయాలు ఓపెన్​ చేస్తాం‌‌‌‌‌‌‌‌ - ముషారఫ్​ అలీ ఫారూఖీ,  రైతు డిస్కం సీఎండీ, హైదరాబాద్​

సౌత్​, నార్త్​ డిస్కంల నుంచి రైతు డిస్కంకు బదిలీ అయిన విద్యుత్​ కనెక్షన్లు

విద్యుత్​ కనెక్షన్లు    ఎస్పీడీసీఎల్‌‌‌‌          ఎన్పీడీసీఎల్‌‌‌‌​

వ్యవసాయం           15,26,876                       13,78,903
లిఫ్ట్ ఇరిగేషన్               192                                  29
జలమండలి                  97                                    2
మిషన్ భగీరథ              423                                 709
డీటీఆర్ల
మున్సిపాలిటీ               350                                 289
నీటి కనెక్షన్లు
మొత్తం కనెక్షన్లు      15,27,938                     13,80,200