- ఆస్తుల విభజన, సిబ్బంది కేటాయింపు వేగవంతం
- డేటా సమీకరణ, వినియోగదారుల విభజనకు చర్యలు
- ఏఎస్‌సీఐలో సమీక్షలో సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) నాటికి రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (రైతు డిస్కం) పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ)లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతు డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ఆస్తుల విభజన, సిబ్బంది కేటాయింపు ప్రక్రియలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు. వినియోగదారుల విభజన, డేటా సమీకరణ, ఉద్యోగుల కూర్పు వంటి కీలక అంశాలు వేగంగా పూర్తి చేస్తామన్నారు. రైతు డిస్కం ఉన్నతాధికారులు, ఏఎస్‌సీఐ విద్యుత్ విభాగ నిపుణులు, పాలసీ, నిర్వహణ రంగాల అనుభవజ్ఞులు పాల్గొని సంస్థ నిర్మాణంపై లోతైన చర్చలు జరిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, విధానాలకు అనుగుణంగా సంస్థ నిర్మాణం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల కేటాయింపుపై ఫోకస్..
ప్రస్తుతం ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి రైతు డిస్కంకు బదిలీ చేయాల్సిన ఆస్తుల గుర్తింపు, వాటి విలువ నిర్ణయం, పారదర్శక విభజనపై ప్రత్యేకంగా చర్చించారు. సాంకేతిక, ఆర్థిక ప్రభావాలను సమీక్షించారు. ఉద్యోగుల కేటాయింపులో నైపుణ్యాల ఆధారంగా విభజన, అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలు, సేవా నిబంధనల రూపకల్పనపై మార్గదర్శకాలు సిద్ధం చేశారు. వ్యవసాయ, నీటి పారుదల, వాటర్ వర్క్స్ వినియోగదారులను వేరు చేసి రైతు డిస్కంకు అనుసంధానం చేసే ప్రక్రియ, కచ్చితమైన డేటాబేస్ తయారీ, సేవల సరళీకరణపై చర్చలు జరిగాయి.
సంస్థ పరిపాలన నిర్మాణం, ఫీల్డ్ స్థాయి అమలు, సాంకేతిక మద్దతు, సేవల్లో పారదర్శకత, సమర్థత పెంపుపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. కార్యకలాపాలు సజావుగా నడవడానికి అవసరమైన విధాన పత్రాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌పై స్పష్టత తీసుకొచ్చారు. సమావేశంలో ఏఎస్‌సీఐ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజకిరణ్ వి బిలోలికర్తో, రైతు డిస్కం చీఫ్ ఇంజినీర్లు పి.ఆనంద్, ఎ.కామేశ్, శ్రవణ్ కుమార్, సీజీఎం సుధా మాధురి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
