రైతుబంధు నమోదుకు..సర్కార్ గ్రీన్​ సిగ్నల్

రైతుబంధు నమోదుకు..సర్కార్ గ్రీన్​ సిగ్నల్
  • 2023, జూన్‌‌‌‌ 16 కటాఫ్ డేట్
  • గడువులోగా పాస్‌‌‌‌బుక్‌‌‌‌ వచ్చిన వారే అర్హులు
  • మరో 2 లక్షల మంది పెరిగే అవకాశం

హైదరాబాద్, వెలుగు: జూన్ 16 నాటికి పాస్​బుక్ వచ్చిన ప్రతి రైతుకూ రైతుబంధు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడి సాయం కోసం పట్టాదారు పాస్​బుక్, ఆధార్​కార్డు, బ్యాంకు పాస్​బుక్ జిరాక్స్ కాపీలను ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఏఈవోకు రైతుబంధు పోర్టల్‌‌‌‌లో ఎడిట్‌‌‌‌ ఆప్షన్‌‌‌‌ అందుబాటులో తెచ్చింది. సీసీఎల్ఏ డేటా ఆధారంగా రైతులను గుర్తిస్తారు. 68.94 లక్షలకు పైగా రైతులు రైతుబంధుకు అర్హులుగా ఉన్నట్లు సీసీఎల్ఏ డేటా ద్వారా తెలుస్తున్నది. 2022 జూన్ 5 నుంచి 2023 జూన్ 16 దాకా జరిగిన సాగు భూముల రిజి స్ట్రేషన్ల డేటాను వ్యవసాయ శాఖకు సీసీఎల్ఏ తాజాగా అందించింది. ఈ డేటా ఆధా రంగా ఏఈవోలు కొత్తగా రైతుబంధు లబ్ధిదారులను ఎంపిక చేసేం దుకు పోర్టల్​లో ఎంట్రీ చేయనున్నారు.

పదెకరాలు పైనోళ్లకు డబ్బులు పడలే

పదెకరాలకు పైగా ఉన్న రైతులకు గత యాసంగి రైతుబంధు డబ్బులు జమ కాలేదు. యాసంగిలో కొత్త లబ్ధిదారులను కూడా నమోదు చేసుకోలేదు. ఈయేడు వానాకాలంలో భూయాజమాన్య హక్కుల మార్పులు, చేర్పులకు చాన్స్​ ఇవ్వడంతో లబ్ధిదారుల సంఖ్య 2లక్షలకు పైగా పెరిగే చాన్స్​ ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులకు ఈనెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే వానాకాలం రైతుబంధు పెట్టుబడి సాయం అందనుంది.

ఐదు రోజులే ఎంట్రీకి అవకాశం

ఈనెల 26 నుంచే రైతుబంధు సాయం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో కొత్తోళ్లను ఎంపిక చేసేం దుకు 5రోజుల గడువు ఉన్నది. నిరుడు వచ్చిన కొత్త పాస్‌‌‌‌బుక్‌‌‌‌ ఎంట్రీలు చేయడం ఏఈవోలకు సమస్యగా మారింది. నెల రోజు లుగా రైతుబంధుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం.. కేవలం ఐదు రోజుల గడువే ఇవ్వడంపై ఏఈవోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతున్నా, మరోవైపు లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అగ్రికల్చర్‌‌‌‌ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. రోజుకో ఎకరం చొప్పున పెంచుతూ పది రోజులకు పైగా నగదు బదిలీచేసే అవకాశాలున్నాయి. ఇదే టైంలోనే పోర్టల్​లో కొత్తవారి పేర్లు ఎంట్రీ చేస్తారని చెబుతున్నారు.