ఇయ్యాల్టి నుంచి రైతుబంధు.. విడతలవారీగా రైతుల ఖాతాల్లో నిధుల జమ

ఇయ్యాల్టి నుంచి రైతుబంధు.. విడతలవారీగా రైతుల ఖాతాల్లో నిధుల జమ
హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రైతులకు సోమవారం నుంచి విడతలవారీగా రైతుబంధు నిధులు అందనున్నాయి. మొదటి రోజున ఎకరంలోపు భూమి ఉన్న రైతుల అకౌంట్లలో పైసలు జమ చేయనున్నారు. రోజువారీగా ఎకరం చొప్పున పెంచుతూ అర్హులైన రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖకు సీసీఎల్‌‌‌‌ఏ అందించగా, ఈ మేరకు వ్యవసాయశాఖ ఎకరాల వారీగా బిల్లుల జాబితా రూపొందించి ఆర్థికశాఖకు అందజేసింది. 

1.54 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం 

రాష్ట్రంలో  సీసీఎల్‌‌‌‌ఏలో నమోదైన పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన 70 లక్షల మంది రైతుబంధుకు అర్హులుగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని 1.54 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. ఈ వానాకాలం రైతుబంధు పంపిణీ చేసేందుకు రూ.7,720.29 కోట్ల నిధులు అవసరమని వ్యవసాయశాఖ నిర్ధారించింది. ఈ ఏడాది మొత్తం లక్షా 50 వేల మంది పోడు రైతులకు రైతు బంధు సాయం అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాలను రాష్ట్ర సర్కారు కొత్తగా పోడు భూములుగా గుర్తించింది.