వీడియో: రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం.. హెలికాఫ్టర్ను కారును తోసినట్లు తోయాల్సి వచ్చింది !

వీడియో: రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం.. హెలికాఫ్టర్ను కారును తోసినట్లు తోయాల్సి వచ్చింది !

తిరువనంతపురం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. కొత్తగా వేసిన కాంక్రీట్ హెలిప్యాడ్లో ఆమె ప్రయాణించిన హెలికాప్టర్ వీల్ చిక్కుకుంది. తిరువనంతపురం నుంచి నీలక్కల్ వరకు హెలికాప్టర్లో రాష్ట్రపతి ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే.. ఆ సమయంలో వాతావరణం అనుకూలించక కొచ్చిలోని ప్రమదం స్టేడియం దగ్గర హెలికాఫ్టర్ ల్యాండ్ కాగానే హెలీప్యాడ్ కాంక్రీట్లో హెలికాప్టర్ వీల్ చిక్కుకుంది.

భద్రతా సిబ్బంది సాయంతో రాష్ట్రపతి క్షేమంగా హెలికాప్టర్ నుంచి బయటపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హెలికాఫ్టర్ను కారును తోసినట్టు ముందుకు నెట్టాల్సి వచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నీలక్కల్ నుంచి పంబకు బయల్దేరి వెళ్లారు. పంబలోని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పంబ నుంచి ప్రత్యేక వాహనంలో శబరిమలకు రాష్ట్రపతి వెళ్లారు.

ముర్ము మధ్యాహ్నం 3:10 గంటలకు సన్నిధానం నుంచి బయలుదేరి, సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్‌లో నీలక్కల్ నుంచి తిరువనంతపురం బయలుదేరుతారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానంలో ముర్ము ప్రయాణం చేశారు. షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రపతి హెలికాప్టర్ నీలక్కల్ దగ్గరే ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషంలో ప్రమదం స్టేడియం దగ్గర హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు.

హెలీప్యాడ్ అప్పుడే పూర్తి చేయడంతో కాంక్రీట్ పూర్తిగా గట్టిపడలేదు. దీంతో.. హెలికాఫ్టర్ ల్యాండ్ అయిన వెంటనే ఆ బరువును తట్టుకోలేక హెలీప్యాడ్ కుంగింది. దీంతో.. హెలికాఫ్టర్ వీల్స్ కాంక్రీట్లో కూరుకుపోయాయి. ల్యాండింగ్ సమయంలో ఇలా జరగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. రాష్ట్రపతి సురక్షితంగా అక్కడ నుంచి బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.