- ఏఐసీసీ జాతీయ కార్యదర్శి సచిన్
యాదగిరిగుట్ట, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో ఓట్లను తొలగిస్తూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖతం చేయడానికి కుట్రలు పన్నుతోందని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి సచిన్ సావంత్ ఆరోపించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏ) నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు మోదీ, అమిత్ షా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను కుట్రపూరితంగా తిరస్కరించడమే ఇందుకు నిదర్శనమన్నారు.
ఓటర్ల హక్కులను హరించొద్దు : బల్మూరి
సూర్యాపేట : ‘సర్’ ప్రక్రియ పేరుతో అర్హులైన పేదలు, కార్మికులు, గ్రామీణ ప్రజల ఓటు హక్కులను హరించవద్దని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్‌లో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లకు (బీఎల్ఏ) ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, సీనియర్ నాయకుడు కత్తి వెంకటస్వామి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, సవరణల నెపంతో ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తే అంగీకరించబోమన్నారు.
