90 శాతం బాయ్స్ బాగానే ఉన్నారు.. ఆ 10 శాతం మందినే..

90 శాతం బాయ్స్ బాగానే ఉన్నారు.. ఆ 10 శాతం మందినే..

తెలంగాణలో మహిళలకు భద్రత ఉందని,  విమెన్ సేఫ్టీ వింగ్ కు రాష్ట్రంలో మంచి పేరు ఉందని అన్నారు భారత బ్రిటిష్ డిప్యూటీహై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్. సికింద్రాబాద్ ఎస్వీఐటీ కాలేజ్ లో విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో బాలికలు,మహిళల భద్రత కోసం పైలట్ ప్రాజెక్ట్ సేఫ్టీ క్లబ్ వాలంటీర్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమాన్ని  అండ్రూ ఫ్లెమింగ్ తో కలసి విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా  ప్రారంభించారు.

ఈ సందర్భంగా విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ  స్వాతి లక్రా మాట్లాడుతూ..నగరంలో మహిళల భద్రత కోసం సేఫ్టీ క్లబ్స్ ను ఏర్పాటు చేశామని, తెలంగాణలోని 5 కాలేజీల్లో  పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా సేఫ్టీ క్లబ్స్  వాలంటీర్లను ఏర్పాటు  చేస్తున్నామని చెప్పారు. ప్రతి కాలేజ్ లో 45 మందితో కూడిన సేఫ్టీ క్లబ్స్ వాలంటీర్లు ఉంటారన్నారు. వీరు గర్ల్స్ స్టూడెంట్స్ భద్రతతో పాటుగా చుట్టూ ఉన్న మహిళ రక్షణ కోసం కూడా పనిచేస్తారని తెలిపారు.

ఈ సేఫ్టీ క్లబ్స్ ను త్వరలో తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు స్వాతి లక్రా. హాక్ ఐ , డయల్ 100 ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, షీ టీమ్స్, విమెన్ సేఫ్టీ వింగ్ ఎప్పటికి మీతోనే ఉంటాయని కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కాలేజ్ స్టూడెంట్స్ ను ఉద్దేశించి చెప్పారు.  80 శాతం నుంచి 90 శాతం వరకు బాయ్స్ బాగానే ఉన్నారని,15 శాతం మంది మాత్రమే ఆకతాయి పనులకు పాల్పడుతున్నారని, వారిని మార్చవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు.

మహిళ భద్రత కోసం తెలంగాణ పోలీసులు సేఫ్టీ క్లబ్స్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆండ్రూ ఫ్లెమింగ్. ఈ సేఫ్టీ క్లబ్స్ ను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్నారు. మహిళ భద్రత కోసం మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, మహిళ భద్రత , చైల్డ్ సేఫ్టీ లో పోలీసులు ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుమతి,కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.