అమెరికాలో పెరుగుతున్న డింక్ కాన్సెప్ట్

అమెరికాలో పెరుగుతున్న డింక్ కాన్సెప్ట్

ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది! ఆఫీస్‌ నుంచి ఇంటికెళ్లి పిల్లలతో కాసేపు గడిపితే అప్పటివరకు పడ్డ స్ట్రెస్​ అంతా మాయమవుతుంది. ఇదంతా ఒకప్పటి తరం ఆలోచన. కానీ.. ఈ జనరేషన్‌లో కొందరు మాత్రం పిల్లలు లేకపోవడమే బెటర్‌‌ అంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వాళ్లలో కొందరు ‘ఖర్చు ఉండదు. బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు’ అంటుంటే... మరికొందరేమో పర్యావరణానికి మేలు చేస్తున్నాం’ అంటున్నారు. ఒకప్పుడు పిల్లలు లేకపోవడం చెప్పుకోలేని బాధ. ఇప్పుడు పిల్లలు ఉండడమంటే భరించలేని ఖర్చు! అందుకే ‘డ్యుయల్‌ ఇన్‌కం నో కిడ్స్‌’ అనే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలామంది కపుల్స్‌.

అమెరికాలో...  

ఈ డింక్‌‌‌‌ కాన్సెప్ట్​ వల్ల అమెరికాలో పిల్లలు లేని కుటుంబాల సంఖ్య ఏ యేటికాయేడు పెరుగుతోంది. కొన్ని స్టడీల ప్రకారం.. అమెరికాలో 2022నాటికి 43 శాతం కుటుంబాల్లో పిల్లలే లేరు. దశాబ్దం క్రితం ఇది 36 శాతంగా ఉండేది. అంటే పదేండ్లలోనే 7 శాతం మంది డింక్‌‌‌‌లుగా మారిపోయారు. అంతేకాదు.. మరి కొన్నేండ్లలో డింక్‌‌‌‌లు 50 శాతానికి చేరుకుంటారని అంచనాలు ఉన్నాయి. అమెరికాలోనే కాదు.. అనేక దేశాల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. దేశాలు ఆర్థికాభివృద్ధి సాధించిన తర్వాత ఒక దశలో సంతానోత్పత్తి రేటు  వేగంగా పడిపోతుందని చెప్తున్నారు వాళ్లు. సాధారణంగా ప్రతి స్త్రీ సగటు జనన రేటు 2.1 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే జనాభా వృద్ధి రేటు తగ్గదు. కానీ.. అంతకంటే తగ్గితే సమస్యలు తప్పవని ఎక్స్‌‌‌‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అయితే.. ఇప్పుడు చాలా దేశాల్లో 2.1 కంటే తక్కువ జనన రేటు ఉంది.