సాగర్ ఉప ఎన్నిక: ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7వరకు పోలింగ్

V6 Velugu Posted on Apr 17, 2021

మొత్తం ఓటర్లు 2,20,300 మంది
7 మండలాల్లో 346 పోలింగ్​ కేంద్రాలు
పోలింగ్​ డ్యూటీలో 5,535 మంది సిబ్బంది
2,930 మంది పోలీసులతో బందోబస్తునాగార్జున సాగర్​ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు భద్రతా సిబ్బందిని మోహరించారు. నియోజకవర్గంలో 2 లక్షల 20 వేల 300 మంది ఓటర్లుండగా, అందులో మగవాళ్లు లక్షా 9 వేల 228 మంది, మహిళలు లక్షా 11 వేల 72 మంది ఉన్నారు. ఏడు మండలాల్లో 346 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 108 సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. 


కరోనా రూల్స్​ ప్రకారం..
అన్ని పోలింగ్​ కేంద్రాల్లో కరోనా రూల్స్​ను పాటిస్తూ ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. వెయ్యి మందికన్నా ఎక్కువ ఓటర్లుండే చోట అదనపు పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 5,535 మంది సిబ్బందిని నియమించారు. అందులో పోలింగ్​ స్టాఫ్​ 1,622 మంది ఉన్నారు. మైక్రో అబ్జర్వర్లుగా 130 మందిని, వెబ్​ కాస్టింగ్​ కోసం 120 మంది, సెక్టార్​, రూట్​ ఆఫీసర్లు కలిపి 88 మందిని నియమించారు. బూత్​ లెవల్​ ఆఫీసర్లు 293 మంది, ఆరోగ్య సిబ్బంది 710 మంది, డ్రైవర్లు 95 మంది ఎన్నికల డ్యూటీ చేయనున్నారు. భద్రత కోసం 2,390 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసులు 1,050 మంది కాగా ఇతర జిల్లాలకు చెందిన మరో వెయ్యి మంది పోలీసులను సాగర్​ నియోజకవర్గంలో మోహరించారు. వారితో పాటు సీఆర్పీఎఫ్​ సిబ్బంది 290, 12వ బెటాలియన్​ స్పెషల్​ పోలీసులు 50 మంది బందోబస్తు డ్యూటీలో ఉంటారు. 
బరిలో 41 మంది అభ్యర్థులు
ఎన్నికల బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులున్నారు. నోముల భగత్​ (టీఆర్​ఎస్​), కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్​), డాక్టర్​ రవి నాయక్​ (బీజేపీ) అభ్యర్థుల మధ్యనే హోరాహోరీ నెలకొంది. మరో 38 మంది ఇండిపెండెంట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాన్​ లోకల్​ నేతలంతా నియోజకవర్గం నుంచి వెళ్లిపోయినా.. నియోజకవర్గంలో జరుగుతున్న మార్పుల గురించి ఆరా తీస్తున్నారు.

 
కలెక్టర్​కు పాజిటివ్​..ఇంటి నుంచే ఏర్పాట్ల పరిశీలన
నల్గొండ జిల్లా కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​కు కరోనా సోకడంతో.. ఇంటి నుంచే ఆయన ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఫీల్డ్​ లెవెల్​లో జేసీ వనమాల చంద్రశేఖరరావు, సాగర్​ ఎన్నికల రిటర్నింగ్​ ఆఫీసర్​ రోహిత్​ సింగ్​లు ఏర్పాట్లను చూసుకుంటున్నారు. పోలింగ్​కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఐజీ ఏవీ రంగనాథ్​ హాలియాలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. హాలియా మండలంలోని గేమ్యానాయక్​ తండా, ఊట్లపల్లి గ్రామాల్లో పోలింగ్​ కేంద్రాలను పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ చిన్న ఘటన జరిగినా నిమిషాల్లో అక్కడికి చేరుకునేలా స్ట్రైకింగ్​ ఫోర్స్​, స్పెషల్​ స్ట్రైకింగ్​ ఫోర్స్​లను నియమించారు.

Tagged Today

Latest Videos

Subscribe Now

More News