ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. సీబీఐ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని హైకోర్టును కోరారు విజయలక్ష్మి. ఈమేరకు శనివారం ( జూన్ 27 ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ లో విజయవాడ పోలీస్ కమిషనర్ పై సంచలన ఆరోపణలు చేశారు విజయలక్ష్మి.
సాయికృష్ణ అదృశ్యం గురించి కమిషనర్ కి తెలుసని... సాయి కృష్ణ లేడని తెలిసినా 40రోజులుగా పోలీస్ కమిషనర్ మౌనంగా ఉన్నారని అన్నారు. తాను ఫిర్యాదు చేసిన 45 రోజుల తర్వాత కేసు నమోదు చేశారని అన్నారు. ఇది సాయి కృష్ణ అదృశ్యంలో ఉన్నతాధికారుల పాత్రలు స్పష్టంగా తెలియజేస్తోందని.. ఈ కేసులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని అన్నారు విజయలక్ష్మి.
సిఐ నాగరాజు అరెస్టు కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని.. ప్రభుత్వ నియమించిన సిట్ పోలీసుల కుట్రలు పూర్తిగా చేదించడం లేదని ఆరోపించారు. తాము ఏదో దర్యాప్తు చేస్తున్నట్లు హైకోర్టును నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని...తాను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను పోలీసులు క్లోజ్ చేయించాలి అనుకుంటున్నారని పేర్కొన్నారు విజయలక్ష్మి.
ఈ కేసును ఎప్పటికీ వెలుగులోకి రానివ్వకుండా అణిచివేయాలని చూస్తున్నారని.. దోషులను శాశ్వతంగా తప్పించాలని పోలీసులు ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో కేసులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిందేనని నివేదించారు. విజయలక్ష్మి పిటిషన్ పై సోమవారం ( జూన్ 29 ) విచారించే అవకాశం ఉంది.
