న్యూఢిల్లీ: ఇండియా లెజెండరీ షట్లర్, బ్యాడ్మింటన్‌లో దేశానికి తొలి ఒలింపిక్ మెడల్ అందించిన సైనా నెహ్వాల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. తన ఆటతో ఇండియన్ బ్యాడ్మింటన్‌కే వన్నె తెచ్చిన మాజీ వరల్డ్ నంబర్ వన్ సైనా సైలెంట్‌గా కెరీర్ ముగించింది. గత రెండేండ్లుగా ఆటకు దూరంగా ఉంటున్నహైదరాబాదీ సైనా.. తన శరీరం, ముఖ్యంగా మోకాలి సమస్యలు ఇకపై ఎలైట్ లెవెల్ బ్యాడ్మింటన్ ఆడటానికి సహకరించడం లేదని సోమవారం స్పష్టం చేసింది. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ నెహ్వాల్ తన ఆరోగ్య పరిస్థితి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.
‘నా మోకాలిలో కార్టిలేజ్ (మృదులాస్థి) పూర్తిగా అరిగిపోయింది. ఆర్థరైటిస్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రపంచంలో అత్యుత్తమంగా రాణించాలంటే రోజుకు 8–9 గంటల ప్రాక్టీస్ అవసరం. కానీ ఇప్పుడు గంట లేదా రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తేనే నా మోకాలు వాచిపోతోంది. ఆ తర్వాత కనీసం నడవలేని పరిస్థితి వస్తోంది. అందుకే ఇక చాలు అనిపించింది. నేను ఇంతకంటే ఎక్కువ ఒత్తిడిని భరించలేను’ అని సైనా ఆవేదన వ్యక్తం చేసింది. సైనా చివరిసారిగా 2023 సింగపూర్ ఓపెన్‌లో ఆడింది. అప్పటి నుంచే తాను ఆటకు దూరమయ్యానని తెలిపింది. ‘నేను క్రీడల్లోకి నా సొంత నిబంధనల ప్రకారమే వచ్చాను.. అలాగే నిష్క్రమించాను. అందుకే ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం నాకు అనిపించలేదు. నేను ఆడటం లేదని ప్రజలకు నెమ్మదిగా అర్థమవుతుంది’ అని నెహ్వాల్ స్పష్టం చేసింది. ఈ విషయం తన తల్లిదండ్రులకు, కోచ్‌లకు కూడా ముందే చెప్పానని, ఇది అనివార్యమైన నిర్ణయమని తెలిపింది.
గాయాలతో పోరాటం
2016 రియో ఒలింపిక్స్ సమయంలో అయిన తీవ్రమైన మోకాలి గాయం వల్ల సైనా కెరీర్ బాగా దెబ్బతింది. అయినప్పటికీ అద్భుతమైన మనోధైర్యంతో ఆమె తిరిగి వచ్చి 2017లో వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్యం, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. కానీ, మోకాలి గాయం తిరగబెట్టడంతో సైనా రాకెట్ పక్కనబెట్టాల్సి వచ్చింది. ఏదేమైనా ఒలింపిక్ పతకం (2012లో) నెగ్గిన ఇండియా తొలి షట్లర్‌గా, వరల్డ్ నంబర్ వన్ (2015లో) అందుకున్న దేశ తొలి మహిళగా చరిత్ర సృష్టించిన సైనా 2010, 2018 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాలు, పలు సూపర్ సిరీస్ టైటిళ్లు, మరెన్నో విజయాలతో యంగ్‌స్టర్స్‌కు స్ఫూర్తిగా నిలిచింది.
