- తక్కువ ధరలో అందుబాటులోకి హైటెక్ హాస్టల్స్
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాల వేటలో సిటీకి, జిల్లా హెడ్ క్వార్టర్లకు వచ్చే ఆడబిడ్డలకు వసతి కష్టాలు తీరనున్నాయి. ప్రైవేట్ హాస్టళ్లలో వేల రూపాయల ఫీజులు కట్టలేక, అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్న మహిళల కోసం ప్రభుత్వమే అండగా నిలుస్తోంది. సఖి నివాస్ (వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్) పేరుతో కార్పొరేట్ స్థాయి వసతులను అతితక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ఉమెన్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీడబ్ల్యూసీడీసీ) పర్యవేక్షణలో హాస్టళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది.
ఇప్పటికే రాష్ట్రంలో 9 చోట్ల హాస్టళ్లు నడుస్తుండగా... మరో 5 చోట్ల పనులు పూర్తయ్యాయి. రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వరంగల్ హాస్టళ్లు ఇప్పటికే ప్రారంభం కాగా.. బంజారాహిల్స్, కామారెడ్డి హాస్టళ్లు ఓపెనింగ్‌కు ముస్తాబయ్యాయి. ఈ ఐదు హాస్టళ్ల నిర్మాణానికి అదనంగా మరో రూ. 2.29 కోట్లు మంజూరు చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ కూడా లభించింది. త్వరలో సూర్యాపేట, నారాయణపేట, మెదక్ జిల్లాల్లో మూడు కొత్త హాస్టళ్లను ప్రారంభించాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.
గ్రేటర్లో 16 హాస్టళ్లు...
ఎక్కువగా ఉద్యోగాల కోసం హైదరాబాద్ కే మహిళలు వస్తుంటారు. అలాంటి వారికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 చోట్ల వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా వీటిని పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో సొంతంగా 5 హాస్టళ్లను నిర్వహిస్తున్నది. ఈ హాస్టళ్లలో పోయిన ఏడాది 1,372 మంది మహిళలు లబ్ధి పొందారు. కొత్త హాస్టళ్ల రాకతో ఈ సంఖ్య భారీగా పెరగనుంది.
తల్లికి వసతి.. బిడ్డకు భద్రత
జాబ్ చేసే మహిళలతో పాటు, వివిధ పనుల మీద వచ్చే వారికి తక్కువ ధరలో సురక్షితమైన వసతి కల్పించడమే సఖి నివాస్ ల స్పెషాలిటీ. చిన్నపిల్లలు ఉన్న తల్లులు జాబ్ మానేయకుండా ఉండేలా.. హాస్టళ్లలోనే డే కేర్ సౌకర్యం కల్పిస్తున్నారు. తల్లీబిడ్డలిద్దరూ ఒకేచోట సురక్షితంగా ఉండేలా ప్లాన్ చేశారు.
భద్రత విషయంలో రాజీపడకుండా 24 గంటల పాటు సీసీ కెమెరాల నిఘా, సెక్యూరిటీ గార్డులు, విజిటర్స్ రెగ్యులేషన్, ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేశారు. ఇక పారిశుధ్యం విషయంలోనూ రెగ్యులర్ ఇన్‌స్పెక్షన్లతో కఠినంగా నియమాలు పాటిస్తున్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి కౌన్సెలింగ్, గ్రీవెన్స్ రిడ్రసల్ కమిటీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
