ప్రపంచ సంస్కృతుల సమ్మేళనానికి ..సాలార్‌జంగ్ మ్యూజియం ప్రతీక :  గవర్నర్ శివప్రతాప్ శుక్లా

ప్రపంచ సంస్కృతుల సమ్మేళనానికి ..సాలార్‌జంగ్ మ్యూజియం ప్రతీక :  గవర్నర్ శివప్రతాప్ శుక్లా
  • మ్యూజియం ప్లాటినం జూబ్లీ వారోత్సవాలకు శ్రీకారం చుట్టిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
  • ఐదేళ్ల ఆధునికీకరణ, విస్తరణ ప్రణాళిక ఆవిష్కరణ.. సావనీర్ షాప్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు చార్మినార్ ఎంత గుర్తింపును తీసుకువచ్చిందో, సాలార్‌జంగ్ మ్యూజియం కూడా అంతే గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ప్రపంచ సంస్కృతుల సమ్మేళనానికి ఈ మ్యూజియం ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. సాలార్‌జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ వేడుకలు, సాలార్‌జంగ్-III జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాలార్‌జంగ్ మ్యూజియం కేవలం తెలంగాణకే కాకుండా దేశ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు.

సాలార్‌జంగ్-III నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ దూరదృష్టి కారణంగానే ప్రపంచ నలుమూలల నుంచి అపురూప కళాఖండాలు హైదరాబాద్‌కు చేరాయని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ‘వీల్డ్ రెబెక్కా’ శిల్పం, అరుదైన ఖురాన్ ప్రతులు, చోళుల కాంస్య విగ్రహాలు, బౌద్ధ, క్రైస్తవ కళాఖండాలు ఈ మ్యూజియాన్ని విశిష్ట స్థాయికి చేర్చాయని గవర్నర్ పేర్కొన్నారు. హైదరాబాద్ విజ్ఞానం, ఆవిష్కరణలు, విద్యకు కేంద్రబిందువుగా ఎదుగుతున్న నేపథ్యంలో మ్యూజియాన్ని పరిశోధన, అధ్యయనం, జ్ఞాన సృష్టికి మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

డిజిటలైజేషన్, పరిశోధన ఫెలోషిప్‌లు, విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాన్ని విస్తరించాలని మ్యూజియం బోర్డుకు సూచించారు. ఈ సందర్భంగా సాలార్‌జంగ్ మ్యూజియం ప్రాధాన్యతను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పేందుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని మ్యూజియంలో నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు గవర్నర్ సూచించారు. మ్యూజియం ఐదేండ్ల అభివృద్ధి, విస్తరణ ప్రణాళికను గవర్నర్‌‌  ఆవిష్కరించారు. అలాగే మ్యూజియం సావనీర్ వర్క్‌షాప్‌ను ప్రారంభించి, హస్తకళలు-చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను షురూ చేశారు.

హైదరాబాద్ నగర ఆత్మకు ప్రతిరూపం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నగరం కొన్ని సంస్థలను నిర్మిస్తే.. మరికొన్ని సంస్థలు ఆ నగర ఆత్మను నిర్మిస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్ నగర ఆత్మకు ప్రతిరూపమన్నారు. ప్రపంచాన్ని ఒడిసిపట్టిన మహోన్నత వ్యక్తి సాలార్ జంగ్-3 అని కొనియాడారు. 43 వేల కళాఖండాలను సేకరించడం అంటే అది కేవలం సేకరణ కాదని, కళలపై ఆయనకున్న అపారమైన భక్తి అని చెప్పారు. ప్రపంచంలోని అరుదైన ‌‌ందర్యాన్ని, చరిత్రను తన సొంత నిధుల నుంచి సేకరించి.. వాటన్నింటినీ ప్రజల ఆస్తిగా మార్చిన ఆయన ఉదారత సాటిలేనిదని చెప్పారు. 

అరుదైన సంపద: మంత్రి పొన్నం ప్రభాకర్

భారతదేశ చరిత్ర, సంస్కృతి, కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన సాలార్ జంగ్ మ్యూజియం 75వ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనడం నాకు  ఆనందంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచంలోనే ఒక వ్యక్తి సేకరించిన అత్యంత అరుదైన కళాఖండాలు, పురావస్తు సంపదను కలిగి ఉన్న మ్యూజియంలలో సాలార్ జంగ్ మ్యూజియం ఒక విశిష్ట స్థానం సంపాదించుకుందన్నారు. ఎమ్మెల్యే మీర్ జుల్ఫికార్ అలీ, గవర్నర్ స్పెషల్ సీఎస్ దానకిషోర్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ ప్రియాంక మేరీ ప్రాన్సిస్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.