25వేల మంది కార్మికులకు సల్మాన్ ఆర్థికసాయం

25వేల మంది కార్మికులకు సల్మాన్ ఆర్థికసాయం

కరోనా సెకండ్ వేవ్‌తో దేశం మొత్తం అస్తవ్యస్తం అవుతోంది. ఎక్కడ చూసినా కరోనా కేసులు, కరోనా మరణాల గురించే చర్చ. సెకండ్ వేవ్ తీవ్రతతో మరోసారి చాలామంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అలా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరోసారి ఆపన్నహస్తం అందించాడు.  కరోనా మొదటి వేవ్ సమయంలో కూడా సినీ కార్మికులకు ఆయన తన సాయం అందించాడు. తాజాగా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులకు ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 1500 జమ చేయనున్నట్లు ప్రకటించారు. 

ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (FWICE) ప్రధాన కార్యదర్శి అశోక్ దుబే మాట్లాడుతూ.. ‘ఫెడరేషన్‌లోని 25 వేల మంది కార్మికుల అకౌంట్ల వివరాలు పంపాలని సల్మాన్ ఖాన్ మేనేజర్ తివారీ కోరారు. వారికి చెందిన బ్యాంక్ ఖాతాలో రూ .1500 జమ చేయాలని సల్మాన్ నిర్ణయించారని తివారీ చెప్పారు. సెకండ్ వేవ్ వల్ల చిత్ర పరిశ్రమ మూతపడింది. మళ్లీ ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయో ఇంకా తెలియదు’ అని దుబే తెలిపారు. 

గత సంవత్సరం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన తర్వాత సినీపరిశ్రమకు చెందిన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమ డిసెంబరు నుంచి కోలుకోవడం మొదలైంది. ఫిబ్రవరి నాటికి రోజువారీ వేతన కార్మికులకు పనులు కూడా లభించాయి. కానీ, అంతలోనే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ విజృంభించి పరిశ్రమను మరింత దిగజార్చింది.

సెకండ్ వేవ్ ప్రారంభం తర్వాత ముంబైలోని మెడికల్, పోలీసులు, మరియు బీఎంసీ కార్మికుల వంటి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సల్మాన్ భోజన వసతులు ఏర్పాటుచేశాడు. అంతేకాకుండా తన నూతన చిత్రం రాధే సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొంతభాగం కరోనా సహాయక చర్యలకు ఉపయోగిస్తామని సల్మాన్ ప్రకటించారు.