
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. పక్క రాష్ట్రం ఏపీతో పోలిస్తే ఇక్కడ వారికి చాలా తక్కువగా జీతాలు ఉన్నాయి. కొన్ని విభాగాల్లో పనిచేసే వారికి నాలుగేండ్ల నుంచి, మరికొన్ని విభాగాల్లో పనిచేసేవారికి మూడేండ్ల నుంచి వేతనాలు పెరగడం లేదు. అయితే ఈ నెల 21న ఢిల్లీలో ఎస్‌ఎస్‌ఏ ప్లానింగ్ అప్రూవల్ బోర్డు(పీఏబీ) సమావేశం ఉండటంతో ఎంప్లాయీస్లో ఆశలు మొదలయ్యాయి. ఈ సారైనా ఎక్కువ జీతం వచ్చేలా రాష్ట్ర అధికారులు పీఏబీకి ప్రతిపాదనలు చేయాలని వారు కోరుతున్నారు.
ఏపీలో రూ. 20 వేలపైనే.. ఇక్కడ?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్ట్ పరిధిలో 18 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఏండ్ల నుంచి పనిచేస్తున్నా వీరికి చాలీచాలని జీతాలే అందుతున్నాయి. ఏ ఒక్కరికీ కనీస వేతనం రూ. 18 వేలు కూడా లేదు. దివ్యాంగ పిల్లలకు పాఠాలు చెప్పే ఇంక్లుజీవ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్స్(ఐఈఆర్పీ)కు నాలుగేండ్లుగా జీతాలు పెంచలేదు. 2014–-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 14 వేల నుంచి రూ. 15 వేలకు చేశారు. ఆ తర్వాత ఊసేలేదు. కానీ ఏపీలో ఐఈఆర్పీల జీతం మాత్రం రూ. 20 వేలు దాటింది. 2014––15 ఆర్థిక సంవత్సరంలో డివిజినల్ లెవల్ మానిటరింగ్ టీమ్(డీఎల్‌ఎంటీ)లకూ రూ. 12 వేల నుంచి రూ. 14 వేలకు చేశారు. ఆ తర్వాత పెంచలేదు.
ఏపీలో ఇదే ఉద్యోగం చేసేవారి జీతం రూ. 20 వేలు దాటింది. మండలంలోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా, రాష్ట్ర కేంద్రాలకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తున్న మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎంఐఎస్) కో ఆర్డినేటర్లకు జీతాన్ని గతేడాది రూ. 13 వేల నుంచి రూ. 15 వేలకు పెంచారు. కానీ, ఏపీలో ఎంఐఎస్ కో ఆర్డినేటర్లకు జీతం రూ. 20 వేల దాకా ఉంది. ఇలా ఎస్‌ఎస్‌ఏలో పనిచేసే ప్రతి ఒక్కరి వేతనాలు ఏపీతో పోలిస్తే మన రాష్ట్రంలో తక్కువగానే ఉన్నాయి. లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీలో కన్నా మిగులు రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణలో తక్కువ వేతనాలు ఇవ్వడం ఏమిటని ఎంప్లాయీస్ అంటున్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తున్నదని చెప్తున్నారు.
ఆందోళనలు చేసినా ఫలితం శూన్యం
గత విద్యా సంవత్సరం ప్రారంభంలో జీతాలు పెంచాలని కలెక్టరేట్ల ముందు ధర్నాలు, స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్ ఎదుట ఎంప్లాయీస్ ఆందోళనలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరికి వారు ప్రగతిభవన్‌నూ ముట్టడించారు. అయినా ఆ ఏడాది పైసా పెరగలేదు. పెంచుతామని స్వయంగా ఎస్పీడీ విజయ్‌కుమార్ హామీ ఇచ్చినా అమలు కాలేదు. ఇదే విషయాన్ని కొందరు ఎస్‌ఎస్‌ఏ అధికారుల దృష్టికి తీసుకుపోతే.. ‘‘మీ ఇష్టం ఉంటే చేయండి లేకుంటే మానేయండి’’ అంటూ చీదరించుకుంటున్నారని ఎంప్లాయీస్ వాపోతున్నారు. అయితే ఈ ఏడాది పీఏబీకి భారీగానే ప్రతిపాదనలు పంపుతున్నామని ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ విజయ్ కుమార్ ‘వెలుగు’తో చెప్పారు. వాటి ఆధారంగా వేతనాలు పెంచుతామని తెలిపారు.
ప్రతిపాదనలే తక్కువ పంపుతున్నారు
ఎస్‌ఎస్‌ఏలో పనిచేసే ఎంప్లాయీస్ వేతనాల కోసం బడ్జెట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కేటాయిస్తుంటాయి. అయితే రాష్ట్రాల నుంచి తీసుకున్న ప్రతిపాదనలకు అనుగుణంగా వేతనాలను పెంచేందుకు కేంద్రం అంగీకరిస్తుంది. మన రాష్ట్ర అధికారులు మాత్రం సరైన ప్రతిపాదనలు పంపడంలో విఫలమవుతున్నారని ఎంప్లాయీస్ అంటున్నారు. గతేడాది పీఏబీకి ఏపీతో పోల్చితే ఇక్కడి అధికారులు చాలా తక్కువ ప్రతిపాదనలు పంపించారు. ఉదాహరణకు ఐఈఆర్పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, సీఆర్‌పీలకు ఏపీ ప్రభుత్వం నెలకు రూ. 28,200 వేతనం ఇవ్వాలనే ప్రతిపాదన చేస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ. 19,800 ఇవ్వాలని ప్రతిపాదించింది. పార్ట్‌టైం ఇన్‌స్ర్టక్టర్లకు తెలంగాణ రూ. 9,900 ఇవ్వాలని ప్రతిపాదనలు పంపిస్తే, ఏపీ రూ. 14,203 ఇవ్వాలని ప్రతిపాదనలు పంపింది. ఇలా అన్ని విభాగాల్లోనూ తక్కువ ప్రతిపాదనలు పంపడంతోనే తమకు తక్కువ జీతాలు అందుతున్నాయని ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.