
- ఉప్పొంగిన డ్రైనేజీలు.. నీళ్లతో నిండిన ఇళ్లు..
- నడుము లోతు నీళ్లతో చెరువుల్లా రోడ్లు..
- వరదలో చిక్కుకున్న వాళ్లను బోట్లపై తరలించిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది
- మరో రెండు రోజులు వానలు.. భయాందోళనలో సిటీ జనం
- రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు
- పొంగిపొర్లుతున్న వాగులు.. పలుచోట్ల నిలిచిన రాకపోకలు
- ప్రాజెక్టులకు భారీగా వరద .. 70 టీఎంసీలకు చేరువలో ఎస్సారెస్పీ నిల్వ
హైదరాబాద్ / వెలుగు, నెట్వర్క్: ఎక్కడ చూసినా మునిగిన కాలనీలు.. నీటితో నిండిన ఇండ్లు.. ఉప్పొంగిన డ్రైనేజీలు.. నడుము లోతు నీళ్లతో చెరువుల్లా కనిపించిన రోడ్లు.. చలి, వానలో మిద్దెలపైన జనం జాగారం.. హైదరాబాద్‌లో కిందటేడాది వరదలు వచ్చినప్పటి పరిస్థితే మళ్లీ రిపీట్ అయింది! బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సిటీలో 250కి పైగా కాలనీలు మునిగాయి. గ్రౌండ్ ఫ్లోర్లలో నీళ్లు నిలిచాయి. ఇండ్లలో చిక్కుకుపోయిన వారిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక్కసారిగా ఇండ్లలోకి నీరు రావడంతో కట్టుబట్టలతో కొందరు పరుగులు తీశారు. చిమ్మచీకట్లో ఎటుపోవాలో దిక్కుతోచక మరికొందరు ఇండ్లపైకి ఎక్కి రాత్రంతా భయం భయంగా గడిపారు. నిత్యావసర వస్తువులు, బట్టలు వరదనీటిలో కొట్టుకుపోవడంతో అవస్థలు పడ్డారు. ఏటా వర్షాకాలంలో తమ పరిస్థితి ఇలాగే ఉంటోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కనీసం అలర్ట్ చేయలేదని మండిపడుతున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో భయాందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్ పరిధిలో చెరువులు నిండి పొంగిపొర్లాయి. దీంతో కాలనీల్లోకి వరద ఉప్పొంగింది. గతేడాది అక్టోబర్‌లో మాదిరే ఇప్పుడూ జనం ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్‌మెట్, సరూర్ నగర్, హయత్ నగర్, ఉప్పల్, నాగోల్, చిలుకానగర్, మల్కాజిగిరి, బేగంపేట్, టోలిచౌకి తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో గ్రౌండ్ ఫ్లోర్లు మునిగిపోయాయి. నాగోల్‌లోని అయ్యప్పకాలనీలో ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం నీళ్లు చేరాయి. జనం ఇండ్లలోనే ఉండిపోవడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది బోట్ల ద్వారా సహాయక చర్యలను చేపట్టారు. ఫుడ్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లను అందించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జీహెచ్ఎంసీ సహాయక చర్యలు ఆలస్యం కావడంతో జనం చాలా ఇక్కట్లు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో 12 గంటలు దాటినా కూడా ఎలాంటి సహాయక చర్యలు ప్రారంభించలేదు. మరోవైపు చెరువులు నిండుతున్నాయని, తోడేందుకు మోటార్లు కావాలంటూ రెండు రోజుల కిందట ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ని కోరినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పైగా అన్నిచోట్ల బోట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సర్కిల్ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారని చెబుతున్నారు.
వరద నీటిలో ఇరుక్కున్న ఎమ్మెల్యే కారు
వరదల్లో మునిగిన కాలనీల్లో పర్యటించేందుకు వచ్చిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు నీటిలో ఇరుక్కుపోయింది. సెక్యూరిటీతోపాటు ఎమ్మెల్యే కూడా దిగి కారు తోశారు.
చేగుంటలో 22.6 సెంటీమీటర్లు
రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. అనేక చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, దాన్ని ఆనుకుని ఉన్న జిల్లాల్లో పెద్దవానలే కురిశాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలని సర్కారుకు సూచించింది. మెదక్‌లోని చేగుంటలో అత్యధికంగా 22.6 సెం.మీ. వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలోని తాటిఅన్నారంలో 21.6, అబ్లుల్లాపూర్ మెట్లో 21.6 సెంటీమీటర్లు, మేడ్చల్ లోని బండ్లగూడలో 21.2, వనస్థలిపురంలో 19.2, హస్తినాపురంలో 19, పెద్దఅంబర్‌పేటలో 18.6, సరూర్‌నగర్‌లో 17.9, హయత్‌నగర్‌లో 17.2, పసుమాముల, రామంతాపూర్‌లలో 17.1 సెంటీమీటర్ల చొప్పున వానలు పడ్డాయి.
మరో రెండు రోజులు మస్తు వానలు
రాష్ట్రంలోని పలు చోట్ల శుక్ర, శనివారాల్లో మస్తు వానలు పడే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.
బురద కడుక్కోవడానికి వెళ్లి గల్లంతు
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సాతరం గ్రామంలో పెద్ద వాగు పొంగిపొర్లింది. దీంతో గురువారం సాతరం గ్రామానికి చెందిన జేడీ ముత్యం(40), దువ్వకా రవి(40), దేశావేణి సుశీల(21).. కోరుట్ల మండలానికి చెందిన తోపారపు లక్ష్మి(55) , తోపారపు నర్సయ్య(61) , దేశవేణి వర్షిణి (15), దేశవేణి అరవింద్(20) వాగులో చిక్కుకు పోయారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్పించారు. వెంపల్లి గ్రామానికి చెందిన కండెల కాశన్న(60) అనే రైతు పొలానికి వెళ్లి తిరిగి వస్తూ.. బురదను కడుక్కోవడానికి గోదావరిలోకి దిగాడు. వరద పెరగడంతో గల్లంతయ్యాడు. ఆయన ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.
జిల్లాల్లో ఇట్లా..
సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండింది. 22,583 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 8 గేట్ల ద్వారా 38,758 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
యాదాద్రి జిల్లా వంగపల్లిలో సర్కారు కట్టించిన 40 డబుల్ బెడ్రూం ఇండ్లు బుధవారం కురిసిన వానకు మునిగిపోయాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని 20 ఇండ్లలోకి నీళ్లు చేరాయి. ఇది లోతట్టు ప్రాంతమని, ఇండ్ల నిర్మాణానికి అనుకూలం కాదని ఆఫీసర్లకు చెబితే వినిపించుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ మధ్యే నిర్మాణం పూర్తి చేసుకున్న రైతు వేదికలోకీ నీళ్లు చేరాయి.
మెదక్ జిల్లా చేగుంట టౌన్‌లోని ఎన్జీవోస్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. బీసీ హాస్టల్బిల్డింగ్ జల దిగ్బంధం కాగా, అందులో చిక్కుకుపోయిన వాచ్‌మన్ యాదగిరి రాజును గురువారం ఉదయం పోలీసులు బయటికి తీసుకొచ్చారు. భారీ వర్షానికి హల్దీవాగు, పుష్పాలవాగు, పసుపులేరు వాగు పొంగిపొర్లి మంజీరా నదికి వరద వస్తోంది.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద మోయ తుమ్మెద వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో సిద్దిపేట– హన్మకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అరెపల్లి గ్రామ పరిధిలోని చంద్రనాయక్ తండాకు చెందిన భూక్య భాస్కర్, వినోద్, యాదగిరి, లక్ష్మణ్ అనే యువకులు వ్యవసాయ బావికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో వరద తాకిడికి కొట్టుకుపోయారు. అయితే ఈత కొట్టుకుంటూ క్షేమంగా ఒడ్డుకుచేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్చుట్టూ ఉన్న దుకాణాల్లోకి వరద నీరు చేరింది. కోనరావుపేట మండలంలోని మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో వట్టిమల్ల, నిమ్మపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
జగిత్యాల జిల్లా కోరుట్ల దగ్గర యెఖీన్‌పూర్ శివారులోని వాగులో ముగ్గురు చిక్కుకుపోగా ఆఫీసర్లు కాపాడారు. మెట్‌పల్లి మండలం ఆత్మకూర్, -పెద్ద తండా మధ్య బ్రిడ్జిపై నుంచి వరద నీటి ప్రవాహంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
యాదాద్రి జిల్లాలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బొల్లేపల్లి – -సంగెం మధ్య భీమలింగం కత్వ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బీబీనగర్- – -భూదాన్ పోచంపల్లి, భువనగిరి–చిట్యాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. నక్కల్‌వాడ గ్రామ సమీపంలోని లోలెవల్ వంతెన పై నుంచి నీళ్లు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నుంచి 39 గేట్లను ఓపెన్ చేసి 1.72 లక్షల క్యుసెక్కులు సముద్రం వైపు పంపిస్తున్నారు.
గత 48 గంటల్లో ఎస్సారెస్పీలోకి 18 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు నీటి మట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,083 అడుగుల వద్ద 65 టీఎంసీల నీరుంది. ఎగువ నుంచి లక్షా 38,144 క్యూసెక్కుల వరద వస్తుండడంతో మరో రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశమున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.