
సికింద్రాబాద్, వెలుగు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) సనత్ నగర్ బ్రాంచ్ మేనేజర్ కార్తీక్ రాయ్ ఖాతాదారుల ఫిక్స్ డ్ డిపాజిట్స్ సొమ్మును కాజేశాడు. రూ.4.75 కోట్ల మేర స్వాహా చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కార్తీక్ రాయ్ ఎస్ బీఐ సనత్ నగర్ బ్రాంచ్ లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. పలువురు స్థానికులు తమ డబ్బులను ఈ బ్రాంచీలో డిపాజిట్ చేశారు.
ఈ క్రమంలో ఓ సాఫ్ట్ వేర్ యువతి తాను డిపాజిట్ చేసిన సొమ్ము నుంచి రూ.49 లక్షలు దారి మళ్లినట్టు గుర్తించింది. ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ ను నిలదీసింది. ఆరు నెలలుగా అడుగుతున్నా తన డబ్బులను ఇవ్వకపోవడంతో ఆమె సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే పలువురు ఖాతాదార్లు తాము డిపాజిట్ చేసిన సొమ్ముల గురించి బ్యాంకులో వాకబు చేశారు.
వారి డబ్బులను కూడా మేనేజర్ కార్తీక్ రాయ్ సొంతానికి వాడుకున్నట్టు తేలింది. ఈ విధంగా వాడుకున్న డబ్బుల విలువ రూ.4.5 కోట్ల దాకా ఉంటుందని ఉన్నతాధికారులు నిర్ధారించారు. దీంతో బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో బాధితులంతా ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.