‘సంగమేశ్వరం’ ప్రాజెక్టు డెడ్ లైన్ 20 రోజులే!

‘సంగమేశ్వరం’ ప్రాజెక్టు డెడ్ లైన్ 20 రోజులే!

ఆగస్టు 19 నాటికి టెం డర్లు పూర్తిచేసేందుకు ఏపీ చర్యలు

వర్కు ఏజెన్సీతో అగ్రిమెంట్ అయితే అనివార్యంగా పనులు కొనసాగే చాన్స్.. 

ఏపీని ఆపకుంటే దక్షిణ తెలంగాణ ఎడారే…

కేఆర్ఎంబీకి కంప్లైంట్ తో పెద్దగా ప్రయోజనం లేదంటున్న రిటైర్డ్ ఇంజనీర్లు..

ఇప్పటికైనా సర్కారు స్పందించాలని విజ్ఞప్తి

 హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టును కబ్జా పెట్టి, పెద్ద ఎత్తున నీళ్లను రాయలసీమకు తరలించుకుపోయేందుకు ఏపీ చేపడుతున్న సంగమేశ్వరం లిఫ్ట్​ స్కీం స్పీడుపై రాష్ట్ర రిటైర్డ్ ఇంజనీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఆ ప్రాజెక్టును 20 రోజుల్లోగా అడ్డుకోకుంటే.. తర్వాత ఇబ్బందులు తప్పవని, దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై కేవలం కృష్ణా బోర్డుకు చేసిన కంప్లైంట్ తో అంతగా ఉపయోగం ఉండదని, రాష్ట్ర సర్కారే రంగంలోకి దిగి అడ్డుకోకుంటే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేసిన వారిగా మిగిలిపోతామని వాపోతున్నారు. ఆగస్టు 19 నాటికి ఆ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ పూర్తవుతుం దని.. ఒకసారి వర్క్ ఏజెన్సీ తో అగ్రిమెంట్ చేసుకుం టే అనివార్యం గా ప్రాజెక్టు పనులు మొదలవుతాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేయడంతో పాటు కేం ద్రానికి కంప్లైంట్ చేసి ఏపీ అక్రమ ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోకుండా అడ్డుకోవాలని సూచిస్తున్నారు.

పనులు మొదలుపెట్టే పట్టుదలతో ఏపీ..

ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం తర్వాత సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం టెండర్ల ప్రక్రియను స్పీడప్ చేశారు. ఆగస్టు 15న ప్రైస్ బిడ్లు ఓపెన్ చేసి అందరికన్నా తక్కువ కోట్ చేసిన వర్కు ఏజెన్సీ పేర్కొన్న మొత్తంతో రివర్స్ టెండర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 19న రివర్స్ టెండర్ల ప్రైస్ బిడ్లను ఓపెన్ చేసి ఎల్1 గా నిలిచిన వర్క్ ఏజెన్సీకి కాంట్రాక్టు అప్పగిస్తారు. 15 రోజుల్లోనే వర్క్ ఏజెన్సీతో అగ్రిమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసేలా ఏపీ జల వనరుల శాఖ ఏర్పాట్లు చేసుకుం టోంది. ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పనులు ప్రారంభిస్తామని పైకి చెప్తున్నా.. అప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఏపీ లేదని, వెంటనే పనులు ప్రారంభిం చి రెండున్నర ఏళ్లలో పూర్తి చేయాలనే టార్గెట్ తో పనులు చేస్తోందని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తెలంగాణకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుం దని, ఇప్పటికైనా సర్కారు కళ్లు తెరిస్తే మంచిదని సూచిస్తున్నారు.

సమస్య తీవ్రత తెలిసినా..!

సంగమేశ్వరం టెండర్లపై మన రాష్ట్ర సర్కారు తీరుబడిగా కృష్ణా బోర్డుకు కంప్లైంట్ చేయడంపైనా రిటైర్డ్ ఇంజనీర్లు మండిపడుతున్నారు. బోర్డు ఏపీని నిలువరిస్తుందన్న నమ్మకం లేదని, ఆ విషయం తెలిసీ సర్కారు కేవలం బోర్డుకు మాత్రమే కంప్లైంట్ చేసి చేతులు దులుపుకోవడం ఏమిటని అంటున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయి వర్క్ ఏజెన్సీతో అగ్రిమెంట్ చేసుకుం టే.. లీగల్ గా ఆ ఏజెన్సీతో సమస్యలు ఎదురవుతాయని, అప్పుడు పనులు అడ్డుకోలేమని మన రాష్ట్ర అధికారు లు స్వయంగా కృష్ణా బోర్డుకు రాసిన లెటర్ లో పేర్కొన్న విషయాన్ని ఇంజనీర్లు ప్రస్తావిస్తున్నారు. సమస్య తీవ్రత తెలిసి కూడా సర్కారు మౌనంగా ఉంటే.. భవిష్యత్ తరాలకు భారీ నష్టం చేసిన వాళ్లమవుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండున్నర నెలలుగా కనీస ప్రయత్నమేలేదు

ఏపీ తలపెట్టి న సంగమేశ్వరం, పోతిరెడ్డి పాడు విస్తరణ సహా 203 జీవోలోని అన్ని పనులపై మే 11న సమీక్షించిన సీఎం కేసీఆర్.. సుప్రీం కోర్టులో కేసు వేసి అయినా ఏపీని అడ్డుకొని తీరుతామని చెప్పారని రిటైర్డ్​ ఇంజనీర్లు గుర్తు చేస్తున్నారు. కానీ రెండు న్నర నెలలు గడిచినా ఇప్పటివరకు లీగల్ గా ఎలాం టి ప్రయత్నం చేయలేదని చెప్తున్నారు. కనీసం సెంట్రల్ వాటర్ కమిషన్ కు , కేం ద్ర సర్కారుకు నిర్దిష్టం గా ఫిర్యాదు కూడా చేయలేదని అంటున్నారు. ఏపీ ప్రాజెక్టులపై ఇంకా ఉదాసీనత సరికాదని, ఇప్పటికైనా సుప్రీంకోర్టులో కేసు వేయడం, కేంద్రం పై ఒత్తిడి తేవడం ద్వా రా ఏపీని కట్టడి చేయాలని కోరుతున్నారు.