మా భూములు ప్రభుత్వం లాక్కోవద్దంటూ..

మా భూములు ప్రభుత్వం లాక్కోవద్దంటూ..
  • నోటీసులివ్వకుండా పనులెలా ప్రారంభిస్తారు

సంగారెడ్డి జిల్లా: లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో తమ భూములు ప్రభుత్వం లాక్కోవద్దని ఆందోళకు దిగారు సంగారెడ్డి జిల్లా బోరంచ గ్రామస్థులు. 50 కుటుంబాల సభ్యులు నిరవదిక దీక్ష చేస్తున్నారు. భూములిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో నిర్మించనున్న బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు మొదట్లోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 84 వేల ఎకరాలకు నీరు అందించే విధంగా ప్లాన్ చేసిన ఈ లిఫ్ట్ లకు గతనెల 21న నారాయణఖేడ్ లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

టెండర్లు ఖరారు కావడంతో వ్యవసాయ భూముల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. అయితే పంట భూములను  ఎట్టి పరిస్థితిలో ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు  రైతులు. నోటీసులు ఇవ్వకుండా  ఇరిగేషన్ అధికారులు  పనులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎంత పరిహారం ఇస్తారో కూడా  చెప్పలేదంటున్నారు. వారం రోజులుగా బోరంచ లోని బసవేశ్వర ఎత్తిపోతల దగ్గర  50కుటుంబాలకు చెందిన రైతులు ధర్నా చేస్తున్నారు.
పుల్కల్ మండలంలో గతంలో నిర్మించిన సింగూరు ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చారు బోరంచ గ్రామ రైతులు. ఇప్పుడు బసవేశ్వర ఎత్తిపోతల పనులతో  మిగిలిన భూములను కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే బొరంచ శివారులోని 175, 185 సర్వే నంబర్ల పరిధిలో 30 ఎకరాల భూమిలో  హద్దులు పెట్టారు. దీంతో  బాధిత రైతులు అధికారులను  అడ్డుకొని వెనక్కి పంపించారు.

ఇదివరకే సింగూరు ప్రాజెక్టు నిర్మాణంలో సగం భూములు కోల్పోయామని, ఇప్పుడు మళ్ళీ బసవేశ్వరం ఎత్తిపోతల కోసం ఉన్న భూమిని లాక్కుంటే తమెలా బతకాలని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బాధిత రైతులు వారం రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్నారు.పక్కనే ఉన్న సంగమేశ్వర ఆలయానికి సంబంధించిన భూములలో నిర్మాణ పనులు చపడితే ఎవరికీ ఇబ్బంది ఉండదంటున్నారు రైతులు. తమ భూముల జోలికి రావొద్దని వేడుకుంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పేరుతో తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దంటున్నారు బాధిత రైతులు. 
 

 

ఇవి కూడా చదవండి

ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

గౌరవం ఇవ్వని చోట ఉండలేను