ఒంటిమిట్ట శ్రీరాముడి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

ఒంటిమిట్ట శ్రీరాముడి  బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

ఏపీలోని ప్రముఖ  ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమవుతోంది. ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు చెప్పారు.  ఏప్రిల్15న శ్రీ సీతారాముల కళ్యాణానికి  విస్తృత ఏర్పాట్లు  చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం తో కలసి బుధవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం   టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని సమావేశ హాలులో టీటీడీ జెఈఓ వీరబ్రహ్మంతో కలిసి  బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై దిశా నిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఏప్రిల్‌ 10 నుండి 18వ తేదీ వరకు శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 15న రాముని కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించామన్నారు.  కళ్యాణోత్సవానికి సంబంధించి ఆలయం లోపల, కళ్యాణ వేదిక వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తిచేయాలని ఆదేశించారు. భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాట్లు పూర్తిచేయాలని తెలిపారు. 

భద్రత , శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు,  అన్నప్రసాదాలు,  విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు, కంట్రోల్ రూం, సీసీ కెమెరాలు, రాత్రి వేళలో కల్యాణోత్సవం చేస్తున్నందున విద్యుదీకరణ అంశాలు, అగ్నిమాపక వాహనం , వైద్య ఆరోగ్యశాఖ వారిచే వైద్య శిబిరం, హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు తదితర అంశాల పై సమీక్షించి పలు సూచనలు జారీ చేశామన్నారు. కోవిడ్ నేపథ్యంలో మాస్కులు కూడా సరఫరా చేయాలని సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారన్నారు. భక్తుల కోసం పథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్‌ సిబ్బంది, మందులు, అంబులెన్సులు, గ్లూకోజ్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. మెరుగైన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం, స్థానికులు టిటిడికి సహకరించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జెఈవో కోరారు.

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

గౌరవం ఇవ్వని చోట ఉండలేను