- అధికారులు, సిబ్బంది బాధ్యత కాకుండా సేవగా భావించాలి: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ప్రాంగణం, మేడారం గ్రామం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు మంత్రి సీతక్క పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణంలో జాతరను నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. డీపీవోలు, డీఎల్పీవోలు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులను జోనల్, సబ్ జోనల్, సెక్టోరల్, సబ్ సెక్టోరల్ అధికారులుగా నియమించినట్టు చెప్పారు.
జోనల్ ఆఫీసర్లుగా 21 మంది డీపీఓలను, సబ్ జోనల్ ఆఫీసర్లుగా 42 మంది డీఎల్పీఓలను నియమించామని, సెక్టార్ ఆఫీసర్లుగా 83 మంది ఎంపీఓలను, సబ్ సెక్టార్ ఆఫీసర్లుగా 480 మంది పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఫీల్డ్ స్థాయిలో 9 వేల మంది కార్మికులను వినియోగిస్తున్నామన్నారు. ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతగా కాకుండా సేవగా భావించి విధులు నిర్వర్తించాలని మంత్రి సూచించారు.
