నోటిఫికేషన్లు ఇస్తే సంజయ్ బాధపడుతుండు : ఎమ్మెల్సీ కవిత

నోటిఫికేషన్లు ఇస్తే సంజయ్ బాధపడుతుండు : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: ‘ఉద్యోగులు కేసీఆర్​కు తొత్తులు అని బండి సంజయ్  విమర్శలు చేస్తున్నరు.. వారు తొత్తులు కాదు.. ఆత్మ బంధువులు. ప్రభుత్వం, ఉద్యోగులు ఒకటే.. వేర్వేరు కాదు. ఆ విషయం వాళ్లు తెలుసుకుంటే మంచిది’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం నాంపల్లిలో టీఎన్జీవో  హైదరాబాద్ జిల్లా న్యూ ఇయర్ డైరీ, క్యాలెండర్​ను కవిత ఆవిష్కరించి మాట్లాడారు. టీఎన్జీవోకు కేసీఆర్​కు మధ్య ఉన్నది పేగు బంధమన్నారు. ఇన్ని స్కీమ్స్ సక్సెస్ కావడానికి, ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి ఉద్యోగులే కీలకమన్నారు. ఈ ప్రభుత్వం ఎంప్లాయి ఫ్రెండ్లీ అని కవిత అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

ప్రభుత్వ స్కీమ్​లను అమలు చేసేది ఉద్యోగులేనని మండలి మాజీ చైర్మన్  స్వామిగౌడ్ అన్నారు. ఏపీలో పనిచేస్తున్న ఫోర్త్ క్లాస్ ఉద్యోగులను తెలంగాణకు తీసుకరావాలని కవితను కోరారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినా కొంత మంది అధికారులు వాటిని అమలు చేయకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఉద్యోగుల సమస్యలపై సీఎంకు అవగాహన ఉందన్నారు. సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డులు, ఇన్ కమ్ ట్యాక్స్ పెంపు, బదిలీలు, 317 జీవో సమస్యలు పరిష్కరించాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ కోరారు.