యాదాద్రి హైవేలపై సంక్రాంతి రద్దీ​

యాదాద్రి హైవేలపై సంక్రాంతి రద్దీ​

యాదాద్రి, వెలుగు: సంక్రాంతి సందర్భంగా యాదాద్రి జిల్లాలోని హైవేలు బిజీ అయ్యాయి. క్షణం కూడా తీరిక లేకుండా వీటి మీదుగా వెహికల్స్​ ప్రయాణించాయి. ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువ వాహనాలు  ఈ రూట్లలో వెళ్లాయి. ఈనెల 13న (శుక్రవారం) ఒక్కరోజే యాదాద్రి జిల్లాలోని రెండు హైవేల మీదుగా 92,808 వాహనాలు రాకపోకలు సాగించాయి. హైదరాబాద్ - విజయవాడ హైవేపై 70 శాతం వెహికల్స్​ ప్రయాణించగా.. మిగిలినవి  హైదరాబాద్ - వరంగల్​ హైవేపై  ప్రయాణించినట్టు చౌటుప్పల్​లోని పంతంగి టోల్​గేట్​, బీబీనగర్​లోని గూడూరు టోల్​గేట్​ లెక్కల ద్వారా తేలింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్​, ఇతర ప్రాంతాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్​ వాహనాల్లో సొంతూళ్లకు లక్షలాది మంది వెళ్లారు. 

వెహికల్స్​ లెక్క ఇదీ.. 

హైదరాబాద్ – విజయవాడ హైవే పై 67,577 వాహనాల రాకపోకలు సాగగా.. ఇందులో కార్లు 53,561, ఆర్టీసీ బస్సులు 1,851, ప్రైవేట్ బస్సులు 4,906, ఇతర వాహనాలు 7,259 ఉన్నాయి. హైదరాబాద్ – వరంగల్ హైవే పై 25,231 వాహనాలు రాకపోకలు సాగించాయి. వీటిలో కార్లు 17844, బస్సులు 872, మిగిలినవి ఇతర ప్రైవేట్​ వాహనాలు ఉన్నాయి. ఇక ఈ నెల 12 న విజయవాడ హైవే మీదుగా 56595 వాహనాలు వెళ్లాయి. వీటిలో కార్లు 42,844, ఆర్టీసీ బస్సులు  1,300, ప్రైవేట్ బస్సులు 4,913, గూడ్స్, ఇతర వాహనాలు 7,538 ఉన్నాయి.  

మొత్తం 86,400 సెకన్లకుగానూ..

ఒక రోజుకు 24 గంటలు, ఒక గంటకు 60 నిమిషాలు, ఒక నిమిషానికి 60 సెకండ్ల చొప్పున 24 గంటలకు 86400 సెకండ్లు ఉంటాయి. అయితే ఈ నెల 13న రెండు హైవేలపై కలుపుకొని మొత్తం 92,808 వాహనాలు ప్రయాణించాయి. ఒక రోజులోని 86,400 సెకండ్ల కంటే 6,408 వాహనాలు ఎక్కువగా రాకపోకలు సాగించాయి.  ఈ లెక్కన శుక్రవారం రోజున ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువ వెహికిల్స్​ ఈ హైవేల మీదుగా వెళ్లాయన్న మాట.  విజయవాడ  హైవే మీదుగా నిమిషానికి 46 వెహికల్స్​ ప్రయాణించగా, వరంగల్​  హైవేపై నిమిషానికి 18 వెహికల్స్​ రాకపోకలు సాగించాయి. 

పల్లెకు పోయిన పట్నం 

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ ఎఫెక్ట్‌‌తో హైదరాబాద్​ సిటీ రోడ్లు బోసిపోయాయి. వరుస సెలవులతో నగరవాసులు వారం సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో రోడ్లన్నీ గత మూడు రోజులుగా ట్రాఫిక్ ఫ్రీ అయ్యాయి. ఇక శనివారం వీకెండ్‌‌, భోగి పండుగ కావడంతో .. నిరంతరం ట్రాఫిక్ తో కిక్కిరిసి ఉండే పంజాగుట్ట,కోఠి, సికింద్రాబాద్‌‌,బంజారాహిల్స్‌‌,హైటెక్‌‌సిటీ, కూకట్‌‌పల్లి పరిసర ప్రాంతాల్లోని రోడ్లు ఖాళీగా కనిపించాయి. ప్రతి రోజు రాత్రి 10.30 గంటల వరకు రద్దీగా ఉండే సిటీ రోడ్లు.. శనివారం రాత్రి 7 గంటలకే నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు,మెట్రో ట్రైన్స్​ లోనూ ప్యాసింజర్స్​రష్​ అంతగా లేదు. ఆదివారం కూడా ఇట్లనే ఉండే చాన్సుంది.