సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. శుక్రవారం ‘పదే పదే’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌లో సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ వేడుకలో సంగీత్ శోభన్ మాట్లాడుతూ ‘అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. ఇందులోని పాటలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. హీరోయిన్, గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ‘పదే పదే’ పాట మా టీమ్‌కు ఫేవరేట్. ప్రతి మహిళ మెచ్చేలా ఈ సాంగ్ ఉంటుంది. సినిమా కూడా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది’ అని చెప్పాడు.
అమ్మాయిల ప్రేమను వ్యక్తపరిచే పాట ఇదని హీరోయిన్ నయన్ సారిక చెప్పింది. నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘మనం ప్రేమ కోసం ఎప్పుడూ ప్రాధేయపడకూడదు. మనమే ప్రేమలా మారిపోవాలి. అదే ఈ ‘పదే పదే’ పాట. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
