కార్మికులు చనిపోతున్నా సమ్మెపై వెనక్కి తగ్గని ప్రభుత్వం
కోర్టు మొట్టికాయలేసినా.. సీరియస్ అయినా అదే తీరు
సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తామన్నా ఒప్పుకోని వైనం
క్టోబర్ ఆరో తేదీ నుంచి ఒకే మాటపై సర్కార్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి సర్కార్ ఒకే స్టాండ్‌పై నిలబడింది. కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా, గుండెపోటుతో చనిపోయినా కనికరించలేదు. అక్టోబర్ ఆరో తేదీ నుంచి సోమవారం వరకూ ఒకే మాటపై ఉంది. ‘‘సమ్మె ఇల్లీగల్. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రసక్తే లేదు. యూనియన్లతో ఎలాంటి చర్చలుండవు’’ అని సీఎం కేసీఆర్ ఎన్ని సార్లు మీడియాతో మాట్లాడినా, ప్రెస్‌నోట్ రిలీజ్ చేసినా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. విచారణ జరిగిన ప్రతిసారి ప్రభుత్వం కోర్టులో ఇదే మాట వినిపించింది. కోర్టు మొట్టికాయలు వేసినా, తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినా తన తీరు మార్చుకోలేదు. ‘‘కోర్టులకే అబద్ధాలు చెబుతారా? న్యాయస్థానాలకు తప్పుడు సమాచారం ఇస్తే పర్యవసానాలు మీకు తెలియవా?’’ అని ఓ దశలో బెంచ్ ఫైర్ అయింది. ఆఖరికి సీఎస్, రవాణా శాఖ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తామని కోర్టు చెప్పినా సర్కార్ ఒప్పుకోలేదు. సమ్మె మధ్యలో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక వచ్చినా వెనక్కి తగ్గలేదు.
యావత్ తెలంగాణ అండగా ఉన్నా..
అక్టోబర్ 5న కార్మికుల సమ్మె ప్రారంభం అయింది. మొదట దసరా పండుగ సమయంలో కాస్త వ్యతిరేకత వచ్చింది. తర్వాత 48 వేల మంది కార్మికులు డిస్మిస్ అని కేసీఆర్ ప్రకటించారు. దీంతో తెలంగాణ సమాజం ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచింది. సబ్బండ వర్గాలు మద్దతు తెలిపాయి. కార్మికులపై సానుభూతి చూపాయి. న్యాయమైన డిమాండ్లతో శాంతియుత ఆందోళనలు చేస్తున్న కార్మికులను ప్రజలు హక్కున చేర్చుకున్నారు. సకల జనుల సమరభేరి, చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. ప్రభుత్వానికి ఇన్ని వ్యతిరేకతలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.


