ఊరు పిల్లల భవిష్యత్తు కోసం టీచర్ గా మారిన సర్పంచ్

V6 Velugu Posted on Oct 27, 2021

ఊరు బాగుపడాలి అంటే మంచి నాయకులు కావాలి. ఊళ్లో జనాలను కలుపుకుపోయి.. అందరి సహకారంతో అభివృద్ధి బాట పట్టించాలి. దారిచూపే వారు మంచి వారైతే జనాలు వారి అడుగు జాడల్లో నడిచేందుకు వెనుకాడరు. అలాంటి కోవకు చెందిన నాయకురాలే ఉమ్మడి నల్లగొండ జిల్లా కంకణాలగూడెం సర్పంచ్. ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలను సక్రమంగా నడిపేందుకు కృషి చేస్తున్నారు. సరిపడ టీచర్లు లేకపోవడంతో తానే ఉపాధ్యాయురాలిగా మారి... ఆ ఊరి పిల్లలకు విద్యాబుద్దులు నేర్పిస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాలగూడెం సర్పంచ్ సరిపెల్లి శైలజ. ఈ ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఉన్నా... చాలామంది తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. దీంతో పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించాలని కోరారు సర్పంచ్ శైలజ. అంతేకాదు.. ముందుగా తన ఇద్దరు పిల్లలను ఇదే స్కూల్లో చేర్పించారు. ఆ తర్వాతే గ్రామస్తుల పిల్లలను ఇందులో చదివించాల్సిందిగా కోరారు. 15 మంది ఉన్న పాఠశాలలో ప్రస్తుతం 43 మంది పిల్లలు చేరేలా విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహించారు సర్పంచ్ శైలజ.

గతంలో ఈ స్కూల్లో ఇద్దరు టీచర్లు ఉండేవారు. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఇక్కడి టీచర్ ను మరో చోటుకు బదిలీ చేశారు. అయితే సర్పంచ్ శైలజ కృషితో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ ఒక్క టీచరే అంతమంది పిల్లలకు పాఠాలు చెప్పడమంటే కష్టం... దీంతో తానే రంగంలోకి దిగారు సర్పంచ్ శైలజ. తన పనులు చేసుకుంటూనే పిల్లలకు క్లాసులు తీసుకుంటున్నారు.

శైలజ MBA వరకు చదువుకున్నారు. గ్రామ సర్పంచ్ మహిళా రిజర్వేషన్ రావడంతో పోటీకి దిగి ఎన్నికల్లో గెలిచారు. చదువుకుంది, సమాజానికి తనవంతుగా ఏదో చేయాలనే తపనా ఉంది. దీంతో గ్రామ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.

తమ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో మళ్లీ మరో టీచర్ ను అలాట్ చేయాలని సర్పంచ్ తో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. అప్పుడే తమ విద్యార్థులకు న్యాయం జరుగుతుందంటున్నారు. డీఈవో ఈ అంశంపై వెంటనే స్పందించాలంటున్నారు సర్పంచ్ శైలజ.

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. కానీ చదువుకున్న అమ్మాయి సర్పంచ్ అయితే.. ఊరంతా బాగుపడుతుందని నిరూపించారు శైలజ.

Tagged NALGONDA, village sarpanch, Teaching, Govt School, teachers shortage

Latest Videos

Subscribe Now

More News