ఉప సర్పంచులకు చెక్​ పవర్​ వద్దు

ఉప సర్పంచులకు చెక్​ పవర్​ వద్దు
  • ‌‌సర్పంచుల ఆందోళన
  • 8న ఇందిరాపార్కు వద్ద ధర్నాకు ప్లాన్
  • జాయింట్​ చెక్​ పవర్​తో విభేదాలొస్తాయంటున్న మాజీ సర్పంచ్‌లు
  • నిధులు దుర్వినియోగం అవుతాయంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: అధికారుల ప్రమేయం లేకుండా సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వడాన్ని సర్పంచ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పలు జిల్లాల్లో ఇప్పటికే మండల పరిషత్ కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేశారు. వచ్చేనెల 8న ఇందిరాపార్కు వద్ద వేలాది మందితో ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు గ్రామ సర్పంచ్, సెక్రటరీ పేరిట ఉన్న చెక్ పవర్ అధికారాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కల్పిస్తూ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలల తర్వాత ప్రభుత్వం చెక్ పవర్ అధికారాన్ని కల్పించింది. అయితే దీనిపై అనేక వాదనలు విన్పిస్తున్నాయి.

ఇద్దరి మధ్య విభేదాలొస్తాయి

సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించటంతో ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయని మాజీ సర్పంచ్‌లు అంటున్నారు. పార్టీ రహితంగా ఎన్నికలు జరిగినా ఏదో ఒక పార్టీ మద్దతుతోనే సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లు గెలుపొందారు. అయితే ఇద్దరు నేతలు ఒకే పార్టీకి చెందిన వారయినా, వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా నిధుల ఖర్చు విషయంలో విభేదాలు తలెత్తుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్లలో భాగంగా బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా నెగ్గారు. అలాంటిచోట్ల ఉప సర్పంచ్‌‌లుగా పెద్ద కులాలకు చెందిన వారు గెలిచారు. ఇలాంటిచోట్ల నిధుల ఖర్చు విషయంలో ఇద్దరి మధ్య పొసగదని మాజీ సర్పంచ్‌‌లు అంటున్నారు.

సెక్రటరీలు సేఫ్!

సర్పంచ్, ఉప సర్పంచ్‌‌లకు చెక్ పవర్ ఇవ్వటంతో సెక్రటరీలు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో నిధులు దుర్వినియోగం అయిన సందర్భాల్లో సర్పంచ్ లు సెక్రటరీలపై మండల అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులు చేశారు. కొన్నిచోట్ల ఇతర పార్టీల సర్పంచ్ లు ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సెక్రటరీలపై ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయి. దీంతో కలెక్టర్లు వారిని బదిలీ చేయటం, సస్పెండ్ చేయటం, నిధులు రికవరీ చేయటం వంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు సెక్రటరీలకు చెక్ పవర్ లేకపోవటంతో అలాంటి చర్యలకు అస్కారం ఉండదంటున్నారు.

రికార్డులపై అవగాహన ఉంటదా?

గతంలో చెక్కుపై సర్పంచ్‌‌ సంతకం చేసినపుడు.. ఆ నిధులను దేనికి ఖర్చు చేస్తున్నారు, సంబంధిత తీర్మానం ఉందా లేదా వంటి అంశాలను సెక్రటరీలు పరిశీలించే వారు. ఇప్పుడు సర్పంచ్‌‌, ఉప సర్పంచ్‌‌కే చెక్ పవర్ ఇవ్వడంతో నిధులు దుర్వినియోగమయ్యే ఛాన్స్‌‌ ఉంటుందని, రికార్డుల నిర్వహణపై కూడా కార్యదర్శికి ఉన్నంత అవగాహన ప్రజాప్రతినిధులకు ఉండదని అధికార వర్గాలంటున్నాయి. దీని ప్రభావం చివరకు గ్రామ పాలన , అభివృద్ధిపై పడుతుందని అంటున్నారు.

వేలాది మందితో ఆందోళన చేస్తం

కార్యదర్శి పాత్ర లేకుండా సర్పంచ్, ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై వేలాది మంది సర్పంచ్ లతో వచ్చేనెల 8న ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తాం. – భూమన్న యాదవ్, సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు

ప్రభుత్వం సర్పంచ్‌‌ల గౌరవాన్ని దెబ్బ తీసింది

సర్పంచ్ లను గ్రామ ప్రజలందరూ ఓట్లేసి ఎన్నుకుంటారు. ఉప సర్పంచ్ ఒక వార్డు మెంబర్ గా గెలిచిన వ్యక్తి. ఇద్దరికి కలిపి చెక్ పవర్ ఇవ్వటం సమంజసం కాదు. సర్పంచ్ గౌరవాన్ని ప్రభుత్వం దెబ్బ తీసింది. వెనుకబడిన వర్గాలకు చెందినవారు సర్పంచ్‌‌లుగా, పెద్ద కులాలకు చెందినవారు ఉప సర్పంచ్‌‌లుగా ఉన్నచోట ఉప సర్పంచ్ లదే పెత్తనం ఉంటుంది. – ఆందోల్ కృష్ణ యాదవ్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు

ఇది కరెక్ట్‌‌ నిర్ణయం కాదు

చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంది. కార్యదర్శి పాత్ర లేకుండా నిధుల దుర్వినియోగం అవుతాయి. ఇట్లయితే ఆరు నెలల్లోనే గ్రామాల్లో వివాదాలు తలెత్తుతాయి. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి. అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. చెక్ పవర్ అంశం సర్పంచ్, ఉప సర్పంచ్ ల మధ్య కొత్త వివాదాలకు దారీ తీస్తుంది. – పర్వతాలు, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు